Khammam: మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పువ్వాడ!

Khammam: మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు 82వ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 1 Nov 2026 1:27 PM IST
Khammam
X

Khammam: మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పువ్వాడ!

Khammam: ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు కొత్తగూడెం నియోజకవర్గానికి దశాబ్దాలుగా ఎనలేని సేవలు అందించిన సీనియర్ రాజకీయ ధురంధరులు, మాజీ మంత్రి శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారి 82వ జన్మదిన సందర్భంగా మాజీ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు వారికి, వారి సతీమణికి, కుటుంబ సభ్యులకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. భగవంతుడు వారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు, ప్రశాంతతను ప్రసాదించాలని, వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మనందరిపై ఉండాలని ప్రార్థించారు.

ఈ సందర్భంగా పువ్వాడ అజయ్ కుమార్ గారు మాట్లాడుతూ వనమా వెంకటేశ్వరరావు గారు మా నాన్నగారికి సమకాలికులు, నాకు తండ్రితో సమానులు. మా ఊరు కూనవరం, వారి ఊరు మర్రిగూడెం. మనమంతా గోదావరి నీళ్లు తాగి పెరిగినవాళ్ళం. గోదావరి పొంగితే గుట్టలెక్కినవాళ్ళం, తగ్గితే బిందెలు పట్టుకొని నీళ్లకు పోయినవాళ్ళం. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులతో మమేకమై ప్రజల జీవన ప్రమాణాలు పెంచిన గొప్ప నాయకులు మన నాన్నగారు మరియు వనమా వెంకటేశ్వరరావు గారు.



సర్పంచ్ స్థాయి నుంచి మొదలుపెట్టి మున్సిపల్ చైర్మన్‌గా, ఎమ్మేల్యేగా, రాష్ట్ర మంత్రిగా ఎదిగిన వనమా గారిది సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. డీసీసీ అధ్యక్షుడిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రికార్డు స్థాయిలో పనిచేశారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో గెలుపోటములు చూసినా, ఏనాడూ ఆయనపై చిన్న మచ్చ కానీ, అపవాదు కానీ రాలేదు.

 కొత్తగూడెం, సింగరేణి ప్రాంతాలలో ఎంతోమందికి ఉద్యోగాలు, ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇప్పించి వేలాది కుటుంబాలకు ఆశాజ్యోతిగా నిలిచారు. పదుల సంఖ్యలో ఉన్న అభిమానులు, కార్యకర్తలు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆయన జన్మదిన వేడుకలకు తరలివచ్చారంటేనే ఆయన సంపాదించుకున్న ప్రజాభిమానం ఎంత గొప్పదో అర్థమవుతుంది.

సాధారణంగా ఎమ్మెల్యే కాగానే హైదరాబాద్‌లో స్థిరపడతారు, కానీ మంత్రిగా ఉన్నప్పటికీ వనమా గారు తన స్వగ్రామమైన పాలవంచను గానీ, అక్కడి ప్రజలను గానీ వదిలిపెట్టలేదు. తన ప్రాంతం, ప్రజలు, కార్యకర్తలపై ఆయనకున్న చెక్కుచెదరని ప్రేమకు ఇది ప్రత్యక్ష నిదర్శనం.

 కేసీఆర్ గారితో చేతులు కలిపింది కూడా తన స్వార్థం కోసం కాదు, కేవలం కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి కోసమే. కేసీఆర్ గారితో కలిసి కొత్తగూడెం కార్పొరేషన్, పాల్వంచ మున్సిపాలిటీ మరియు గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం వందలాది కోట్ల రూపాయల నిధులను సాధించి నియోజకవర్గాన్ని సువర్ణాక్షరాలతో లిఖించేలా అభివృద్ధి చేశారు. కేసీఆర్ గారి గుండెల్లో వనమా గారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.

మంచి రోజుల్లో ఎవరు తోడున్నా లేకపోయినా, కొంచెం ఆపదలు లేదా కష్టకాలం వచ్చినప్పుడు వనమా గారి కుటుంబానికి నేను అండగా ఉంటానని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. అనారోగ్య సమస్యలను జయించి, తిరిగి ప్రజల మధ్యకు వచ్చి కార్యకర్తలకు కొండంత అండగా నిలిచిన వ్యక్తి వనమా గారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో ఖమ్మం జిల్లాలో గళమెత్తిన అతికొద్ది మంది నాయకుల్లో వనమా వెంకటేశ్వరరావు గారు ఒకరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినా, తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా పనిచేసినా ఆయన చెరిపేయలేని ముద్ర వేశారు.బిఆర్ఎస్ పార్టీకి వనమా గారి ఆశీస్సులు, మార్గదర్శనం ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ, ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాని పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు.

కార్యక్రమంలో నాయకులు RJC కృష్ణ, బచ్చు విజయ్ కుమార్, బొమ్మేర రామ్మూర్తి, పిన్ని కోటేశ్వరరావు, మనీషా లక్ష్మి,బోసు,మాటేటి కిరణ్, మోరంపుడి సాయి,తోట కనకారావు తదితరులు పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.