Khammam: ప్రెస్ క్లబ్‌పై ఆడిటింగ్ జరపాలి.. టిడబ్ల్యూజేఎఫ్ డిమాండ్

Khammam: ఖమ్మం ప్రెస్ క్లబ్‌లో గత పదేళ్లుగా జరుగుతున్న ఆర్థిక అవకతవకలపై ఆడిటింగ్ జరిపించాలని, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ను కోరింది.

M RAVIKIRAN
Published on: 4 May 2026 9:01 PM IST
Khammam
X

Khammam: ప్రెస్ క్లబ్‌పై ఆడిటింగ్ జరపాలి.. టిడబ్ల్యూజేఎఫ్ డిమాండ్

Khammam: ఖమ్మం ప్రెస్ క్లబ్ లో గత పది సంవత్సరాలుగా జరుగుతున్న ఆర్థిక వ్యవహారాలపై ఆడిటింగ్ చేపట్టడంతో పాటు ప్రెస్ క్లబ్ నిర్వహణ పారదర్శకంగా సాగేందుకు ఎన్నికలు నిర్వహించాలని అలాగే అవకతవకలకు తావులేకుండా అర్హులందరికీ అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్ - హెచ్ - 2843), ఖమ్మం జిల్లా కమిటీ జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకరకు సోమవారం వినతిపత్రాలు సమర్పించింది.

గత పది సంవత్సరాలుగా ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఓ రెండు యూనియన్లకు సంబంధించిన జర్నలిస్టులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రెస్ క్లబ్ నిర్వహణ పారదర్శకంగా ఉండకుండా చేస్తున్నారని తెలిపింది. ప్రెస్ మీట్ నిర్వాహకుల వివరాలు, ఆదాయం, ఖర్చులు వాటికి సంబంధించిన బిల్స్ చూపకుండా అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. ప్రశ్నించిన వారిని టార్గెట్ చేస్తూ ప్రజాస్వామ్య బద్దంగా ఉండాల్సిన ప్రెస్ క్లబ్ ను భ్రష్టు పట్టిస్తున్నారని, ప్రెస్ క్లబ్ పేరు చెప్పుకొని వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించింది.

జర్నలిస్టు వృత్తికే మచ్చ తెస్తున్న ఇటువంటి వ్యవహారాలపై చర్యలు తీసుకోవాలని కోరింది. క్లబ్ నియమ నిబంధనల మేరకు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆడిటింగ్ చేయాల్సిందిగా టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ విజ్ఞప్తి చేసింది. ఖమ్మం ప్రెస్ క్లబ్ పై గుత్తాధిపత్యం చెలాయిస్తున్నవారు చివరకు కలెక్టర్ కు ప్రెస్ క్లబ్ పై ఉన్న అధికారమేంటని.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వరకు పరిస్థితి వచ్చిందని టీడబ్ల్యూజేఎఫ్ టీడబ్ల్యూజేఎఫ్ బృందం కలెక్టర్ దృష్టికి తెచ్చింది.

ఖమ్మం ప్రెస్ క్లబ్ నిర్వహణ సక్రమంగా సాగాలంటే ఆడిటింగ్ ప్రక్రియ చేపట్టడంతో పాటు నియమ నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది. అలాగే అక్రిడిటేషన్ ల కేటాయింపులో అవకతవకలకు తావు లేకుండా చూడాలని కోరింది. అనర్హులు ఏ ఒక్కరికీ అక్రిడిటేషన్ కేటాయించొద్దని, అర్హులకు అన్యాయం జరగకుండా చూడాలని టీడబ్ల్యూజేఎఫ్ విజ్ఞప్తి చేసింది. నిబంధనల పేరుతో పెద్ద పత్రికలను ఇబ్బందులు పెట్టొద్దని, రకరకాల సర్టిఫికెట్ల పేరుతో అక్రిడిటేషన్ లలో కోత విధించొద్దని కోరింది. డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ లు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.

ఈ విషయమై రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి సైతం తీసుకువెళ్లినట్లు టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సయ్యద్ ఖదీర్, కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి చెప్పారు. స్పందించిన కలెక్టర్ డీపీఆర్వో, డీసీవోలకు చర్యల నిమిత్తమై ఆదేశాలు ఇచ్చారు. ఈ ‌కార్యక్రమంలో జిల్లా నాయకులు దువ్వా సాగర్, ఆవుల శ్రీనివాస్, మానుకొండ రవికిరణ్, మధుశ్రీ, జానీపాషా, గరిడేపల్లి వెంకటేశ్వర్లు, దగ్గుబాటి మాధవరావు, ఎన్. రామచంద్రమూర్తి, ఫయాజ్, అర్షద్, పాషా, గణేష్, కొరెకొప్పుల రాంబాబు, గోపి, కిరణ్, డి. రవికుమార్, ఉప్పలయ్య, వి. అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.

M RAVIKIRAN

M RAVIKIRAN

Next Story