Bhadrachalam: గిరిజనుల హక్కుల వీరుడు కొమరం భీమ్: ఐటీడీఏ ఏపీవో
Bhadrachalam: భద్రాచలం ఐటీడీఏ సమావేశ మందిరంలో అమరవీరుడు కొమరం భీమ్ 86వ వర్ధంతి సందర్భంగా ఏపీవో జనరల్ డేవిడ్ రాజ్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
Bhadrachalam: గిరిజనుల హక్కుల వీరుడు కొమరం భీమ్: ఐటీడీఏ ఏపీవో
భద్రాచలం: మారుమూల ఆదివాసి గిరిజన గూడెంలలో నివసిస్తున్న గిరిజనుల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు జల్ జంగిల్ జమీన్ మరియు వారికి చెందవలసిన హక్కులు సాధించుకోవడానికి నిజాం ప్రభుత్వంతో పోరాడి అసువులు బాసిన పోరాట వీరుడు, అమరజీవి కొమరం భీమ్ అని ఐటిడిఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ అన్నారు.
ఈరోజు ఐటీడీఏ సమావేశం మందిరంలో అమరవీరుడు కొమరం భీమ్ 86వ వర్ధంతి సందర్భంగా యూనిట్ అధికారులు మరియు సిబ్బంది సమక్షంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం ఆయన మాట్లాడుతూ అదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజన ఉద్యమ నాయకుడు కొమరం భీమ్ గిరిజన గోండితెగకు చెందిన కొమరం చిన్ను, సోంబాయి దంపతులకు 1901 అక్టోబర్ 22న ఆసిఫాబాద్ తాలూకా, సంకెపల్లి గ్రామంలో జన్మించాడని, కొమరం భీమ్ జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా శైలిలో పోరాడారని, అడవిని జీవనోపాధిగా చేసుకొని, అన్ని రకాల నిజాం అధికారాలను అనగా న్యాయస్థానాలు, చట్టాలు తోసిపొచ్చాడని, నిజాం నవాబ్ సైనికులకు వ్యతిరేకంగా ఆయుధాలు తీసుకున్నాడు.
పశువుల కాపరులపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా, తమ భూమిలో తమదే అధికారం అని జల్ జంగల్ జమీన్, భూమి అడవి నీరు మాదే అనే నినాదంతో ఉద్యమించాడని, ఆదివాసీలపై నిజాం నవాబు సాగించిన దోపిడీ దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ విరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించిన కొమరం భీం జల్ జంగల్ జమీన్ నినాదానికి ప్రతికగా నిలిచిపోయాడని అన్నారు.
కొండ కోనల్లో, ప్రకృతితో సహజీవనం సాగించే ఆదివాసి ప్రజలకు అడవి పై హక్కు సామాజిక న్యాయములో భాగం అని నినాదిస్తూ, 1928 నుంచి 1940 వరకు రణభేరి మోగించిన కొమరం భీమ్ నిజాం సర్కారు గుండెల్లో సింహ స్వప్నంగా మారిన పోరాటయోధుడని, 15 ఏళ్ల వయసులో అటవీక శాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి మరణించగా, కొమరం భీమ్ కుటుంబం కెరమెరి ప్రాంతంలోని సుర్దాపూర్ కు వలస వెళ్లిందని, సాగు చేసుకుంటున్న భూమిని సిద్ధికి అనే జమీందారు ఆక్రమించుకోవడంతో ఆవేశం పట్టలేని భీమ్ అతని హతమార్చి అస్సాం వెళ్లిపోయాడని, ఐదేళ్లపాటు కాపీ, తేయాకు తోటల్లో పనిచేస్తూ గడిపిన భీమ్ తిరిగి కెరమెరి గ్రామానికి చేరుకున్నాడి.
నిజము నవాబు పశువుల కాపరులపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా గిరిజనులను ఒక్క తాటిపై నడిపించి ఉద్యమం సాగించాడని, భీమ్ కు కుడి భుజంగా కొమరం సూరు కూడా ఉద్యమంలో పాల్గొన్నాడని, వెడ్మా రాము కూడా బిమ్ కు సహచరుడిగా ఉన్నాడని, నిజాం సైన్యం మీద, అటవీ సిబ్బంది పైన కొమరం భీమ్ కొదమ సింహంలా గర్జించాడని, కుర్దు పటేల్ అనే నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారంతో, అర్ధరాత్రి కొమరం భీమ్ స్థావరాలను సైన్యం చుట్టూముట్టగా జోడేఘాట్ అడవుల్లో 1940, అక్టోబర్ 27న అంటే ఆదివాసీలు పవిత్రంగా భావించే ఆశ్వీయూజ శుద్ధ పౌర్ణమి రోజున కొమరం భీం వీరమరణం పొందాడని ఆయన అన్నారు.
గిరిజనుల హక్కుల కోసం పోరాడిన కొమరం భీముని స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ఐటిడిఏ కార్యాలయానికి వచ్చే గిరిజనులకు మన వంతు సహకారం అందించి వారికి చెందవలసిన సంక్షేమ పథకాలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన అన్నారు.




