Kothagudem: 2,190 కిలోల గంజాయి సీజ్.. 219 మంది అరెస్ట్
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2,190 కిలోల గంజాయి సీజ్, 219 మంది అరెస్ట్. మాదకద్రవ్యాల నివారణ కమిటీ సమావేశంలో DRO పద్మావతి ఆదేశాలు.
Kothagudem: 2,190 కిలోల గంజాయి సీజ్.. 219 మంది అరెస్ట్
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం, అక్రమ రవాణాను అరికట్టేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారిణి పద్మావతి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీలోని జిల్లా అదనపు కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నివారణ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లాలో ఇప్పటివరకు 2,190.63 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దీని విలువ సుమారు రూ.11.20 కోట్లు ఉంటుందని వెల్లడించారు. గంజాయి కేసుల్లో 219 మందిని అరెస్టు చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. మాదకద్రవ్యాలకు బానిసైన 65 మందిని డీ-అడిక్షన్ కేంద్రాలకు తరలించినట్లు వివరించారు.
యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా పాఠశాలలు, కళాశాలలు, కార్మిక ప్రాంతాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పద్మావతి సూచించారు. గంజాయి అక్రమ రవాణాపై నిరంతర నిఘా, తనిఖీలు చేపట్టాలని, ఆర్టీసీ సిబ్బంది కూడా అనుమానాస్పద వస్తువుల రవాణాపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మిషన్ పరివర్తన కార్యక్రమం ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
సురక్షిత ఆహారంపై ప్రత్యేక దృష్టి
అనంతరం ఆహార భద్రతపై నిర్వహించిన సమీక్షలో జిల్లాలో ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందేలా నిరంతర తనిఖీలు చేపట్టాలని పద్మావతి సూచించారు. కల్తీ ఆహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆహార భద్రత అధికారులను ఆదేశించారు.
ప్రతి ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ తప్పనిసరిగా FSSAI లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ పొందాలని సూచించారు. హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్ షాపులు, కిరాణా దుకాణాలు, వీధి ఆహార విక్రయదారులు సహా అన్ని ఆహార వ్యాపారాలు నిబంధనలు పాటించాలని అధికారులు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు నిర్వహించిన తనిఖీల్లో సర్వైలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ శాంపిళ్లను సేకరించినట్లు వెల్లడించారు.




