Kothagudem: 55వ డివిజన్‌లో 39 మందికి చేయూత పెన్షన్ల పత్రాల అందజేత

Kothagudem: కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని 55వ డివిజన్‌లో అర్హులైన 39 మంది లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 14 Nov 2026 9:23 PM IST
Kothagudem
X

Kothagudem: 55వ డివిజన్‌లో 39 మందికి చేయూత పెన్షన్ల పత్రాల అందజేత

కొత్తగూడెం: అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని డీసీసీ అధికార ప్రతినిధి వై. శ్రీనివాసరెడ్డి, 55వ డివిజన్ కార్పొరేటర్ సింగర హరిహరన్ పేర్కొన్నారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 55వ డివిజన్ కూలీలైన్‌లో మంజూరైన 39 మంది లబ్ధిదారులకు వారు చేయూత పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత కార్మికులు, డయాలసిస్ బాధితులకు కలిపి 4.50 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేయడం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు.

గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని విమర్శిస్తూ.. ప్రస్తుత ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ, ఇందిరమ్మ ఇళ్లు, ఇంటి స్థలాలు, రేషన్ కార్డులు, సన్నబియ్యం, చేయూత పెన్షన్లు, రైతు భరోసా, ఉచిత విద్య, వైద్యం, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

ఈ నెల 19న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా పేదలకు రూ.5 లక్షల జీవిత బీమా పథకాన్ని ప్రభుత్వం కల్పించనున్నట్లు వారు వెల్లడించారు. డివిజన్ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న వై. శ్రీనివాసరెడ్డి, కార్పొరేటర్ సింగర హరిహరన్‌లను ఈ సందర్భంగా డివిజన్ పెద్దలు, మహిళలు అభినందించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM