Kothagudem: గిరిజనులపై కేంద్రం వివక్ష విడనాడాలి ఎఎఆర్‌ఎం భూక్యా వీరభద్రం
Kothagudem: గిరిజనులపై వివక్ష వీడాలి AARM నేత వీరభద్రం.. సెప్టెంబర్ 7న జంతర్ మంతర్ ధర్నాను జయప్రదం చేయాలని పిలుపు.
Kothagudem: గిరిజనులపై కేంద్రం వివక్ష విడనాడాలి ఎఎఆర్‌ఎం భూక్యా వీరభద్రం
Kothagudem: కొత్తగూడెం గిరిజనుల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షాపూరిత విధానాలను తక్షణమే విడనాడాలని ఆదివాసి అధికార్ రాష్ట్రీయ మంచ్ (AARM) జాతీయ కమిటీ సభ్యులు, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి భూక్యా వీరభద్రం డిమాండ్ చేశారు. అటవీ హక్కుల చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి ఆదివాసీలకు భూమిపై హక్కులు కల్పించాలని కోరారు.
కొత్తగూడెంలో బుధవారం తెలంగాణ గిరిజన సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా కన్వీనర్ వాంకుడోత్ అమర్ సింగ్ నాయక్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన భూక్యా వీరభద్రం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గిరిజనులు భూమి, ఉపాధి, విద్య, వైద్యం తదితర అనేక సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
పోడు సాగుదారులకు హక్కు పత్రాలు ఇవ్వాలి
అటవీ హక్కుల చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి గిరిజనులకు సాగుభూములపై హక్కులు కల్పించాలని ఆయన కోరారు. గిరిజనులను వారి సాగుభూముల నుంచి తొలగించే చర్యలను నిలిపివేయడంతో పాటు పోడు సాగుదారులందరికీ హక్కు పత్రాలు అందించాలని డిమాండ్ చేశారు.
గిరిజన యువతకు ఉద్యోగాలు కల్పించాలి
దేశంలో గిరిజన నిరుద్యోగం పెరుగుతోందని, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంలో నిర్లక్ష్యం జరుగుతోందని భూక్యా వీరభద్రం ఆరోపించారు. గిరిజన యువతకు విద్య, ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.
గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి, భూమి వంటి మౌలిక సమస్యలను పరిష్కరించడంతో పాటు రాజ్యాంగం కల్పించిన గిరిజన హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.
జంతర్ మంతర్ మహాధర్నాను జయప్రదం చేయాలి
గిరిజన సమస్యలపై దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు సెప్టెంబర్ 7న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆదివాసి అధికార్ రాష్ట్రీయ మంచ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహాధర్నాకు గిరిజనులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని భూక్యా వీరభద్రం పిలుపునిచ్చారు. మహాధర్నాలో భూ సమస్యలు, అటవీ హక్కుల చట్టం అమలు, నిరుద్యోగం, విద్య, వైద్యం తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయనున్నట్లు తెలిపారు.
సమావేశంలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా నాయకులు వాంకుడోత్ అమర్ సింగ్, కున్సోత్ షణ్ముఖ నాయక్, రాములు, హేమ తదితరులు పాల్గొన్నారు.




