Julurpadu: నర్సింగ్ విద్యార్థిని హరిణి హత్య కేసు నిందితుడు అరెస్ట్

Julurpadu: కొత్తగూడెం జిల్లాలో నర్సింగ్ విద్యార్థిని హరిణి హత్య కేసులో పరారీలో ఉన్న నిందితుడు దేవరకొండ పవన్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

SK MAHABOOB JANI, JULURPADU
Published on: 1 Oct 2026 5:22 PM IST
Julurpadu
X

Julurpadu: నర్సింగ్ విద్యార్థిని హరిణి హత్య కేసు నిందితుడు అరెస్ట్

జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి హత్య కేసులో పరారీలో ఉన్న నిందితుడు దేవరకొండ పవన్ కుమార్‌ను జూలూరుపాడు పోలీసులు అరెస్ట్ చేశారు.

22.09.2026న మధ్యాహ్నం సుమారు 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో వెంగన్నపాలెం గ్రామంలోని తన ఇంటి వద్ద ఇంద్రపల్లి హరిణి (18) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు మృతురాలి తల్లి రాజేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తొలుత Cr.No.155/2026 U/s 194 BNSS కింద కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా, మెడకు వైర్ వంటి వస్తువుతో బిగించి హత్య చేసినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. దీంతో కేసును U/s 103(1) BNS కింద హత్య కేసుగా మార్చారు.

దర్యాప్తులో మృతురాలు హరిణి, నిందితుడు దేవరకొండ పవన్ కుమార్ (22), గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నట్లు, వివాహం చేసుకోవాలని భావించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే ఇరువురి కుటుంబాల మధ్య ఏర్పడిన వివాదాల నేపథ్యంలో హరిణి పవన్ కుమార్‌ను వివాహం చేసుకోవడానికి నిరాకరించినట్లు, ఈ కారణంతోనే నిందితుడు హరిణిని హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది.

హత్య అనంతరం నిందితుడు పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలో నిందితుడు ఒంటిగూడిసె రోడ్‌లోని సీతారామ ప్రాజెక్టు కాలువ సమీపంలో దాచిపెట్టిన TS-28-G-9583 నంబర్ గల గ్లామర్ ద్విచక్ర వాహనాన్ని తీసుకుని దూర ప్రాంతానికి వెళ్లి ర్యాపిడోలో పని చేసుకుంటూ జీవించేందుకు ప్రయత్నిస్తున్నాడన్న నమ్మదగిన సమాచారం పోలీసులకు అందింది.

సమాచారం మేరకు జూలూరుపాడు సీఐ, ఎస్‌ఐ మరియు సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి నిందితుడు దేవరకొండ పవన్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులు:

- TS-28-G-9583 నంబర్ గల గ్లామర్ బైక్

- రెండు మొబైల్ ఫోన్లు — ఒకటి మృతురాలి ఫోన్, మరొకటి నిందితుడి ఫోన్

- బైక్ గేర్ వైర్

- నిందితుడు ధరించిన షర్ట్

ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

SK MAHABOOB JANI, JULURPADU

SK MAHABOOB JANI, JULURPADU