Kothagudem: సింగరేణి కార్మిక సమస్యలపై ఏఐటీయూసీ రిలే నిరాహార దీక్షలు

Kothagudem: సింగరేణి కార్మికుల డిమాండ్ల సాధనకై ఈ నెల 18, 19 తేదీల్లో అన్ని జీఎం కార్యాలయాల ఎదుట రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్లు ఏఐటీయూసీ తెలిపింది.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 14 Nov 2026 5:50 PM IST
Kothagudem
X

Kothagudem: సింగరేణి కార్మిక సమస్యలపై ఏఐటీయూసీ రిలే నిరాహార దీక్షలు

కొత్తగూడెం: సింగరేణి కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం, పెండింగ్ డిమాండ్ల సాధనే లక్ష్యంగా ఈ నెల 18, 19 తేదీల్లో సింగరేణి వ్యాప్తంగా అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయాల ఎదుట రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్లు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) నాయకులు వంగ వెంకట్, జి. వీరస్వామి తెలిపారు.

శనివారం కొత్తగూడెంలోని శేషగిరిభవన్‌లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ, ఏఐటీయూసీ కేంద్ర నాయకత్వం పిలుపు మేరకు రెండు రోజులపాటు ఈ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయం ఎదుట జరిగే దీక్షల్లో కార్మికులు, యూనియన్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ సందర్భంగా మూడు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ప్రతి నెలా మెడికల్ బోర్డు నిర్వహించి గతంలో మాదిరిగా 100 శాతం డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించాలని, ఇప్పటికే మెడికల్ ఫిట్ అయినప్పటికీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న సుమారు 200 మంది డిపెండెంట్లకు తక్షణమే నియామక పత్రాలు అందజేయాలని డిమాండ్ చేశారు.

అలాగే టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో నుంచి సింగరేణికి రావాల్సిన రూ.59 వేల కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం, యాజమాన్యం చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ, గతంలో యూనియన్‌తో కుదుర్చుకున్న పెండింగ్ ఒప్పందాల అమలు కోసం ఈ పోరాటం చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

కార్మికుల హక్కులు, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపడుతున్న రిలే నిరాహార దీక్షల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బ్రాంచ్ కార్యదర్శులు ఎస్.వి. రమణమూర్తి, జక్కుల గట్టయ్య, నాయకులు లక్ష్మీనారాయణ, చంద్రయ్య, మండల రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM