Kothagudem: ఎర్త్ సైన్సెస్ వర్సిటీ అభివృద్ధికి రోడ్ మ్యాప్
Kothagudem: కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైనింగ్ స్వర్ణోత్సవాలు; డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ వర్సిటీ అభివృద్ధికి రోడ్ మ్యాప్ సమర్పిస్తామని బిక్కి రమేష్ వెల్లడి.
Kothagudem: ఎర్త్ సైన్సెస్ వర్సిటీ అభివృద్ధికి రోడ్ మ్యాప్
భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణకే తలమానికంగా నిలిచిన కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైనింగ్ (KSM) 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ విద్యార్థులు గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సుమారు 200 మంది పూర్వ విద్యార్థులు పాల్గొని ఆనందోత్సాహాల మధ్య సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా కేఎస్ఎంలో బీటెక్ మైనింగ్, ఎంటెక్ మైనింగ్ పూర్తి చేసిన పూర్వ విద్యార్థి బిక్కి రమేష్ హెచ్ఎంటీవీతో మాట్లాడుతూ.. 1976లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కొత్తగూడెంకు తరలించి ప్రారంభించిన కేఎస్ఎం 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించినట్లు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా మైనింగ్, సాంకేతిక రంగాల్లో వస్తున్న ఆధునిక మార్పులు, అభివృద్ధిపై ప్రస్తుత విద్యార్థులకు అవగాహన కల్పించడమే వర్క్‌షాప్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. అదేవిధంగా దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని భవిష్యత్తులో ఏ విధంగా అభివృద్ధి చేయాలనే అంశంపై పూర్వ విద్యార్థులంతా చర్చించినట్లు వెల్లడించారు.
యూనివర్సిటీ అభివృద్ధికి అవసరమైన సూచనలు, ప్రణాళికలతో ప్రత్యేక రోడ్ మ్యాప్ రూపొందిస్తున్నామని, మరో రెండు మూడు నెలల్లో ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు బిక్కి రమేష్ తెలిపారు. మైనింగ్ కోర్సులతో పాటు ఇంజనీరింగ్, జియాలజీ వంటి ఇతర కోర్సులను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైనింగ్‌లో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విశేష కృషి చేశారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో యూనివర్సిటీ ఏర్పాటు సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పూర్వ విద్యార్థుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.




