Kothagudem: కొత్తగూడెం మార్కెట్‌లో అక్రమ వసూళ్లపై చర్యలు తీసుకోవాలి
Kothagudem: కొత్తగూడెం మార్కెట్లలో కాంట్రాక్టర్ల అక్రమ వసూళ్లపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ విద్యాసాగర్ వినతిపత్రం.
Kothagudem: కొత్తగూడెం మార్కెట్‌లో అక్రమ వసూళ్లపై చర్యలు తీసుకోవాలి
కొత్తగూడెం: కొత్తగూడెం పట్టణంలోని రోజువారీ మార్కెట్, రైతు బజార్ మరియు ప్రతి ఆదివారం నిర్వహించే సంతలో కాంట్రాక్టర్లు మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించిన రుసుములకు విరుద్ధంగా అధిక మొత్తాలు వసూలు చేస్తున్నారని బీజేపీ కొత్తగూడెం టౌన్ అధ్యక్షులు శీలం విద్యాసాగర్ ఆరోపించారు.
ఈ మేరకు కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి, గౌరవ మేయర్ గారికి వినతిపత్రం సమర్పించిన ఆయన మాట్లాడుతూ, మార్కెట్ నిర్వహణను కాంట్రాక్టర్లకు అప్పగించామని చెప్పి మున్సిపల్ అధికారులు తమ బాధ్యత నుండి తప్పించుకోవడం సరైన విధానం కాదన్నారు. టెండర్ ద్వారా కార్పొరేషన్‌కు ఆదాయం వస్తున్నందున, కాంట్రాక్టర్ల వసూళ్లపై నిరంతర పర్యవేక్షణ నిర్వహించి ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత మున్సిపల్ యంత్రాంగంపై ఉందని పేర్కొన్నారు.
పండ్ల వ్యాపారుల నుండి ₹20, ఇతర చిన్న వ్యాపారుల నుండి ₹30 మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా ₹50 నుండి ₹60 వరకు వసూలు చేస్తున్నట్లు పలువురు వ్యాపారులు ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. అలాగే ప్రతి ఆదివారం నిర్వహించే సంతలో ఒక్కో దుకాణం నుండి ₹100 వరకు బలవంతంగా వసూలు చేస్తున్నారని రైతులు, చిన్న వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
ఇప్పటికే దుకాణాల అద్దెలు, రవాణా ఖర్చులు, ఇతర నిర్వహణ వ్యయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిన్న వ్యాపారులు, రైతులపై ఈ అక్రమ వసూళ్లు మరింత ఆర్థిక భారాన్ని మోపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
అందువల్ల ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, అధిక రుసుములు వసూలు చేస్తున్న కాంట్రాక్టర్లపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించిన అధికారిక రుసుముల పట్టికను రోజువారీ మార్కెట్, రైతు బజార్, ఆదివారం సంతతో పాటు అన్ని మార్కెట్ ప్రాంగణాల్లో ప్రజలకు స్పష్టంగా కనిపించే విధంగా బహిరంగంగా ప్రదర్శించాలని కోరారు.
చిన్న వ్యాపారులు, రైతుల హక్కులను కాపాడేందుకు అవసరమైతే బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని కూడా చేపడతామని శీలం విద్యాసాగర్ హెచ్చరించారు.
ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా నాయకులు రమేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి చంద్రగిరి రమేష్ మరియు కలంకార్ రాజశేఖర్, పట్టణ మహిళా అధ్యక్షురాలు బంధువుల యామిని పూర్ణా, చంటి రాజ,భాస్కర్ గౌడ్, శ్రీకాంత్ యాదవ్ పట్టణ నాయకులు పాల్గొన్నారు.




