Kothagudem: ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు కలెక్టర్ అంకిత్ భాగస్వామ్యం

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శ్రీనగర్ కాలనీలో ఇందిరమ్మ లబ్ధిదారులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్న కలెక్టర్ అంకిత్. దీపాలు వెలిగించి సంబరాలు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 7 Nov 2026 8:54 PM IST
Kothagudem
X

Kothagudem: ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు కలెక్టర్ అంకిత్ భాగస్వామ్యం

కొత్తగూడెం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” సంబరాల కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ అంకిత్ శనివారం లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనగర్ కాలనీలో పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులైన వసంత, ఉపేంద్ర, లీలావతి ఇళ్లలో నిర్వహించిన దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ముచ్చటించారు. అనంతరం వారితో కలిసి దీపాలు వెలిగించి, టపాసులు కాల్చి దీపావళి సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. లబ్ధిదారులతో కలిసి పండుగ ఆనందాన్ని పంచుకుంటూ వారి సంతోషంలో భాగస్వాములయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఆనందం నింపాలని, ప్రతి ఇంటా వెలుగులు విరజిమ్మాలని ఆకాంక్షించారు.

పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే సమయంలో ప్రతి ఒక్కరూ భద్రతా జాగ్రత్తలు పాటించాలని, టపాసులు కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా, ఆనందంగా దీపావళి పండుగను జరుపుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. సొంతింటిని నిర్మించుకోవడం ప్రతి పేద కుటుంబానికి ఎంతో గొప్ప కల అని, ఇందిరమ్మ ఇళ్ల ద్వారా ఆ కల నెరవేరుతుండటం సంతోషకరమని తెలిపారు. సొంత ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి పండుగలు జరుపుకోవడం ఎంతో ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుందని అన్నారు .

ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ సవేరాం, ఎంపీడీవో సంబంధిత శాఖల అధికారులు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM