Kothagudem: సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనే పంచాయతీ ప్రణాళికల లక్ష్యం
Kothagudem: 2026-27 ఆర్థిక సంవత్సరానికి జిల్లా, మండల పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనపై కలెక్టర్ అంకిత్ అధ్యక్షతన సమీక్ష.
Kothagudem: సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనే పంచాయతీ ప్రణాళికల లక్ష్యం
కొత్తగూడెం: జిల్లా పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక , మండల పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక కార్యాచరణ సమావేశం లో జిల్లా కలెక్టర్ అంకిత్ 2026–27 ఆర్థిక సంవత్సరానికి జిల్లా పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక , మండల పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనపై జిల్లా కలెక్టర్ అంకిత్ అధ్యక్షతన శుక్రవారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా స్థాయి కార్యాచరణ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, గ్రామీణాభివృద్ధిని మరింత వేగవంతం చేయడంతో పాటు గ్రామస్థాయిలో సమగ్ర అభివృద్ధిని సాధించేందుకు పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు సమర్థవంతమైన సాధనమని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధనలో జిల్లా, మండల పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు .
భారత ప్రభుత్వం నిర్దేశించిన 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో ప్రతి మండలం రెండు లక్ష్యాలను ప్రాధాన్యత అంశాలుగా ఎంపిక చేసి, ఆయా లక్ష్యాలకు సంబంధించిన కనీసం 25 శాతం ప్రాజెక్టు ఆధారిత కార్యకలాపాలను మండల పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలో తప్పనిసరిగా పొందుపరచాలని అధికారులను ఆదేశించారు. ఎంపిక చేసిన లక్ష్యాలు గ్రామాల అవసరాలు, స్థానిక పరిస్థితులు, అందుబాటులో ఉన్న వనరులు, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు దోహదపడేలా ఉండాలని సూచించారు.
మండల పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు ఎంపీడీవోలు నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని, జిల్లా పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనకు జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి నోడల్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తారని తెలిపారు. సంబంధిత అన్ని శాఖల అధికారులు తమ శాఖలకు సంబంధించిన గణాంకాలు, భౌతిక, ఆర్థిక ప్రగతి, అవసరాల వివరాలను సకాలంలో అందించి ప్రణాళికల రూపకల్పనకు సహకరించాలని ఆదేశించారు.
పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు గ్రామాల వాస్తవ అవసరాలను ప్రతిబింబించేలా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పేదరిక నిర్మూలన, జీవనోపాధి మెరుగుదల, ఆరోగ్యవంతమైన గ్రామాలు, బాలలకు అనుకూల వాతావరణం, నాణ్యమైన విద్య, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, పచ్చదనం, స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాలు, సామాజిక న్యాయం, సుపరిపాలన, మహిళా సాధికారత వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, ఆదాయ వనరుల పెంపు కోసం గ్రామీణ పర్యాటకం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులు, పౌల్ట్రీ, పశుసంవర్థక అభివృద్ధి, సేంద్రీయ వ్యవసాయం, గ్రామ ఉత్పత్తుల జియో ట్యాగింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్, మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ఆదాయ వృద్ధి కార్యక్రమాలు వంటి ప్రాజెక్టులను ప్రణాళికల్లో చేర్చాలని సూచించారు.
అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి తమ శాఖల పథకాలు, నిధులు, వనరులను సమీకరిస్తూ ఫండ్ కన్వర్జెన్స్ ద్వారా గ్రామాల అవసరాలకు అనుగుణంగా సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించాలని ఆదేశించారు. గ్రామసభల ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరించి, గ్రామాభివృద్ధికి అవసరమైన పనులను ప్రాధాన్యత క్రమంలో గుర్తించాలని తెలిపారు.
ప్రతి ప్రాజెక్టుకు లక్ష్యం, అంచనా వ్యయం, నిధుల వనరు, అమలు చేసే శాఖ, కాలపట్టిక, ఆశించిన ఫలితాలను స్పష్టంగా తెలుపుతూ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. రూపొందించే ప్రణాళికలు గ్రామాల సమగ్రాభివృద్ధికి దోహదపడటంతో పాటు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో ఆదర్శంగా నిలవాలని అన్నారు.
ప్రతి శాఖ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి నిర్దేశిత గడువులోగా ప్రతిపాదనలు సమర్పించాలని, శాఖల మధ్య సమన్వయంతో నాణ్యమైన జిల్లా, మండల పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జెడ్పి సీఈవో నాగలక్ష్మి, జిల్లా ప్రణాళిక అధికారి సునీత, జిల్లా పంచాయతీ అధికారి అనూష, మిషన్ భగీరథ ఈ ఈ తిరుమలేష్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.




