Julurupadu: 3 గ్రామపంచాయతీల అభివృద్ధిపై సమగ్ర యాక్షన్ ప్లాన్!

Julurupadu: జిల్లా కలెక్టర్ అంకిత్ జూలూరుపాడు మండల పరిషత్ సమావేశంలో ఎల్‌నీనో పరిస్థితులపై సమీక్షించి, వరికి బదులుగా ఆయిల్ పామ్, ఆరుతడి పంటలు వేయాలని ఆదేశించారు.

SK MAHABOOB JANI, JULURPADU
Published on: 28 July 2026 4:36 PM IST
Julurupadu
X

Julurupadu: 3 గ్రామపంచాయతీల అభివృద్ధిపై సమగ్ర యాక్షన్ ప్లాన్!

జూలూరుపాడు: ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రతి 45 రోజులకు ఒకసారి నిర్వహించే మండల ప్రజా పరిషత్ సాధారణ సమావేశాల సందర్భంగా రెండు రోజులపాటు జిల్లాలోని అన్ని మండలాల్లో మండల స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జూలూరుపాడు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి జిల్లా కలెక్టర్ అంకిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సమావేశంలో జూలూరుపాడు మండల పరిధిలోని 23 గ్రామపంచాయతీల్లో వివిధ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, భవిష్యత్ కార్యాచరణపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. గ్రామాల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, సాధించాల్సిన లక్ష్యాలపై మండల స్థాయి అధికారులు, సర్పంచులతో విస్తృతంగా చర్చించారు.

జలసిరి కార్యక్రమం కింద ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ మరుగుదొడ్లు, ఫారం పాండ్లు, పర్‌కొలేషన్ ట్యాంకుల నిర్మాణం, అలాగే ఎల్‌నీనో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో సుమారు 40 మిల్లీమీటర్ల వర్షపాతం లోటు నమోదైందన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా సాధారణం కంటే అధిక వర్షాలు కురిసినప్పటికీ, ఈ ఏడాది పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని తెలిపారు. దాదాపు 25 సంవత్సరాల తర్వాత ఎల్‌నీనో ప్రభావం కారణంగా అధిక ఉష్ణోగ్రతలు, గాలిలో వేడి శాతం పెరగడం వంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు .

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ, నీటిపారుదల, పశుసంవర్ధక, విద్య తదితర శాఖలు సమన్వయంతో కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. రెండు రోజులపాటు మండల స్థాయి సమావేశాల్లో విస్తృతంగా చర్చించి, రాబోయే సంవత్సరంలో ఎల్‌నీనో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్లు వెల్లడించారు.

గత సీజన్‌లో వరితో పాటు మొక్కజొన్న సాగు కూడా అధికంగా జరిగిందని, సుమారు 42 వేల మెట్రిక్ టన్నుల ధాన్యంతో పాటు 70 వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేసినట్లు తెలిపారు. రైతులు వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, ఇతర ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగు ద్వారా రైతులకు సుమారు 25 సంవత్సరాల పాటు స్థిరమైన ఆదాయం లభించే అవకాశం ఉందన్నారు. అలాగే పత్తి, కూరగాయలు వంటి మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న పంటల సాగును ప్రోత్సహించాలని, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

భూగర్భ జలాలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్న కలెక్టర్, ప్రతి గ్రామంలో ఫారం పాండ్లు, పర్‌కొలేషన్ ట్యాంకులు, ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించేలా పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

విద్యార్థులు, అంగన్‌వాడీ కేంద్రాల పిల్లలకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు పూర్తి స్థాయిలో అందేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ సందర్భంగా జడ్పీ సీఈవో నాగలక్ష్మి మాట్లాడుతూ, జూలూరుపాడు మండలానికి 99 ఫారం పాండ్ల నిర్మాణ లక్ష్యం నిర్దేశించగా, ఇప్పటివరకు 29 ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీలో కనీసం నాలుగు ఫారం పాండ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందన్నారు. గాంధీనగర్, గుండ్లరేవు, కాకర్ల,కొత్తూరు, దలవల తండా గ్రామాల్లో ఇప్పటివరకు ఫారం పాండ్లు గుర్తించలేదని , ఆయా గ్రామాలకు ప్రాధాన్యత ఇచ్చి నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో పర్‌కొలేషన్ ట్యాంకులు, ఫారం పాండ్లు ఏర్పాటు చేసేలా సర్పంచులు, అధికారులు రైతుల్లో అవగాహన కల్పించి సహకరించాలని ఆమె కోరారు.

అనంతరం శాఖల వారీగా మండలంలో చేపడుతున్న కార్యక్రమాలను మండల స్థాయి అధికారులు వివరించారు.ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శైలజ, తాసిల్దార్ శ్రీనివాస్, అన్ని శాఖల మండల స్థాయి అధికారులు, సర్పంచులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

SK MAHABOOB JANI, JULURPADU

SK MAHABOOB JANI, JULURPADU

Next Story