Kothagudem: విద్య, వైద్యం రంగాలకు సీఎస్‌ఆర్ నిధుల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
Kothagudem: కొత్తగూడెం జిల్లాలో విద్యా, వైద్య రంగాల అభివృద్ధికి కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
Kothagudem: విద్య, వైద్యం రంగాలకు సీఎస్‌ఆర్ నిధుల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలి
Kothagudem: జిల్లాలో విద్యా, వైద్య రంగాల అభివృద్ధికి కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధుల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలోని సింగరేణి, కేటీపీఎస్, నవభారత్, ఐటీసీ తదితర పరిశ్రమల ప్రతినిధులతో సీఎస్‌ఆర్ నిధుల ద్వారా అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, చేపట్టాల్సిన కొత్త పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు పాఠశాలల్లో తరగతి గదుల అభివృద్ధి, ఫర్నిచర్, తాగునీటి సదుపాయాలు, పారిశుద్ధ్య వసతులు, డిజిటల్ విద్యా సౌకర్యాల ఏర్పాటు వంటి అంశాలకు సీఎస్‌ఆర్ నిధులను వినియోగించాలని కోరారు.
ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన పరికరాలు, మౌలిక వసతులు, రోగుల సౌకర్యాల కల్పనకు పరిశ్రమలు సహకరించాలని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవల విస్తరణకు అవసరమైన కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అందుతున్న వినతులు, ఫిర్యాదులు, స్థానిక అవసరాల ఆధారంగా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి సీఎస్‌ఆర్ నిధులను వినియోగించేలా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరే పనులను ఎంపిక చేసి, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ వేగవంతంగా అమలు చేయాలని చెప్పారు.
గిరిజన, గుత్తికోయ ప్రాంతాల్లో విద్య, వైద్యం, తాగునీటి సదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించిన కలెక్టర్, జిల్లాలోని అన్ని పరిశ్రమలు సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని కోరారు. సీఎస్‌ఆర్ నిధుల వినియోగం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలని అన్నారు.
సమావేశంలో పరిశ్రమల ప్రతినిధులు తమ సంస్థల ద్వారా ఇప్పటివరకు చేపట్టిన సీఎస్‌ఆర్ కార్యక్రమాల వివరాలను వెల్లడించగా, భవిష్యత్తులో చేపట్టనున్న పనులపై చర్చించారు.
ఈ సమావేశం లో సి పి ఓ సంజీవరావు,సంబంధిత శాఖల అధికారులు, వివిధ పరిశ్రమల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.




