Kothagudem: విద్యాభివృద్ధికి ఆజాద్ సేవలు చిరస్మరణీయం: కాంగ్రెస్ నేతలు!
Kothagudem: కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను డీసీసీ నేతల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
Kothagudem: విద్యాభివృద్ధికి ఆజాద్ సేవలు చిరస్మరణీయం: కాంగ్రెస్ నేతలు!
కొత్తగూడెం, నవంబర్ 11: స్వాతంత్ర్య సమరయోధుడు, భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను కొత్తగూడెంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ జిల్లా కార్యదర్శి గౌస్ మొయినుద్దీన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ సభ్యులు జేబీ శౌరి, కాంగ్రెస్ నాయకులు తూము చౌదరి హాజరై ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలు జరిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్య పోరాటంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రిగా సుమారు 11 సంవత్సరాల పాటు బాధ్యతలు నిర్వహించి విద్యారంగ అభివృద్ధికి పునాదులు వేశారని పేర్కొన్నారు.
ముఖ్యంగా బాలికల విద్యకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, 14 ఏళ్లలోపు పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్య అందించాలనే లక్ష్యంతో కృషి చేశారని తెలిపారు. విద్య ద్వారానే సమాజంలో సమానత్వం, అభివృద్ధి సాధ్యమని విశ్వసించిన మహనీయుడని కొనియాడారు. ఆజాద్ ఆశయాలు, విద్యారంగానికి ఆయన చేసిన సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా అధ్యక్షులు అల్లాడి నరసింహారావు, జిల్లా మైనార్టీ నాయకులు ఎండీ గౌస్ పాషా, మాజీ కో ఆప్షన్ సభ్యులు ఎండీ ఆరిఫ్ ఖాన్, జిల్లా మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ కరీం పాషా, మైనార్టీ టౌన్ జనరల్ సెక్రటరీ కమర్, ఎస్.కె. చాంద్ పాషా, హుస్సేన్ బి, దుర్గారాశి సమ్మయ్య, టైలర్ నరసయ్య, ఏలేటి వెంకటేశ్వర్లు, సీతారాములు, సుమన్ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.




