Kothagudem: కొత్తగూడెంలో పర్సా స్థూపావిష్కరణ.. సీపీఎం శ్రేణుల ఘన నివాళి!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్యే పర్సా సత్యనారాయణ 11వ వర్ధంతి సభ.
Kothagudem: కొత్తగూడెంలో పర్సా స్థూపావిష్కరణ.. సీపీఎం శ్రేణుల ఘన నివాళి!
Kothagudem: కార్మిక హక్కుల రక్షణకై పోరాటాలు ఉధృతం చేయడమే పర్సా సత్యనారాయణకు ఇచ్చే ఘనమైన నివాళి అని సిపిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు పి రాజారావు అన్నారు. కార్మిక ఉద్యమ నేత వీర తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మాజీ ఎమ్మెల్యే పర్స సత్యనారాయణ 11వ వర్ధంతి సందర్భంగా స్థానిక సెవెన్ హిల్స్ దగ్గర నిర్మించిన పర్స స్థూపాన్ని రాజారావు ఆవిష్కరించారు.
ముందుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సభలో రాజారావు మాట్లాడుతూ.. పర్సా సత్యనారాయణ మొదట గుంటూరు జిల్లా నుండి కారేపల్లికి వచ్చి పర్సా అక్కడి గ్రామస్తులతో పరిచయాలు పెంచుకున్నారని, గ్రామస్థులు పర్సాకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలనుకున్న నేపధ్యంలో శేషగిరిరావును సింగరేణిలో కమ్యూనిస్టు పార్టీని నిర్మించేందుకు సుందరయ్య కొత్తగూడెంకు పంపారని, ఆయన పరిచయంతో పర్స ఉద్యోగం సంపాదించారు.
దీంతో పర్సాక కార్మికోద్యమంతో పరిచయాలు ఏర్పడ్డాయని తెలిపారు. 1945 జూన్ 16న కొత్తగూడెంలో యూనియన్ ఏర్పాటు చేయడంలో పర్సా ముఖ్యమైన పాత్ర పోషించారని వివరించారు. కంపెనీలో యూనియన్ కార్యకలాపాలు పెరుగుతున్నకొద్దీ యాజమాన్యం చూపు పర్సాపై పడింది. డ్యూటీ అవర్స్‌లో యూనియన్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడనీ, యూనియన్ ఆఫీసులో చేయాల్సిన పనిని కంపెనీలో చేస్తున్నాడనీ అభియోగం మోపి పర్సాను పని నుంచి తొలిగించారు. దీంతో కంపెనీలో పెద్ద అలజడి నెలకొంది. పర్సాను పనిలోకి తీసుకోవాలని సుమారు నాలుగైదు వేల మంది కొత్తగూడెంలో కంపెనీ హెడ్డాఫీసు ముందు బైఠాయించారు. దీంతో యాజమాన్యం దిగొచ్చి తిరిగి పనిలోకి తీసుకుందన్నారు.
ఈ పోరాటమే కార్మిక వర్గంలో పర్సాను గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దిందన్నారు. ఉద్యోగం ద్వారా కార్మిక వర్గ విప్లవంలో పూర్తిస్థాయిగా పాల్గొనలేనని భావించి పర్సా ఉద్యోగానికి రాజీనామా చేసి యూనియన్ బాధ్యతలు చేపట్టారని తెలిపారు. నాటినుండి పర్సా కార్మికోద్యమాలకు నాయకత్వం వహించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడుగా సుదీర్ఘ కాలం పాటు పనిచేశారని తన యావత్ జీవితం కార్మికు ఉద్యమానికి అంకితం చేశారని తెలిపారు. నిర్బంధ కాలంలో కార్మికోద్యమ నిర్మాత పర్సా, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్.
1946లో మేడేను నిర్వహించిన సందర్భంగా 1947 లో అరెస్టయిన పర్సా 1953 వరకూ జైల్లోనే ఉన్నారనీ అన్నారు. 1949 మార్చిలో ఔరంగాబాద్ జైలు నుంచి తప్పించుకున్నారు. తర్వాత ఎఐటియుసిలో చురుగ్గా పని చేశారు. 1970లో సిఐటియు స్థాపించే వరకూ అలానే కొనసాగారు. 1962లో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారని కొత్తగూడెం ప్రాంతంలో దీర్ఘాలికంగా ఇప్పుడు అనుభవిస్తున్న అభివృద్ధి పర్సా సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సాధించినదేనని గుర్తు చేశారు. 1966లో ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనే నినాదంతో సాగుతున్న పోరాటంలో భాగంగా పార్టీ నిర్ణయం మేరకు ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారనీ తెలిపారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకున్న పర్స, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారు రవికుమార్.
పర్సా సత్యనారాయణ కార్యకర్తలను కంటికి రెప్పల కాపాడుకునేవాడని తెలిపారు. తాను ఎక్కడున్నా కార్యకర్తల బాగోగులు యోగక్షేమాలు కోరుతూ ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపే వాడని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా మహాసభల సందర్భంగా పర్సా సత్యనారాయణ ప్రసంగాల ద్వారా కార్యకర్తలను ఉత్తేజ పరిచేవారని ఉద్యమానికి కార్యోన్ముకులును చేసే విధంగా తన ప్రసంగాలు ఉండేవని తెలిపారు. అమరజీవులు బండారు చందర్రావు ,బత్తుల భీష్మారావు లను నక్సలైట్లు చంపినప్పుడు భావోద్వేగానికి లోనయ్యారని ఈ స్ఫూర్తితో మన ఉద్యమాలు మరింత ముందుకు తీసుకెళ్లాలని కార్యకర్తలకు ఆదర్శాన్ని నింపారని తెలిపారు.
త్యాగానికి నిరాడంబతకు ప్రతిరూపం పర్స, ఏపీ రాష్ట్ర కమిటీ సభ్యులు మంతెన సీతారాం. పర్సా తన యావత్ జీవితం కార్మిక ఉద్యమానికి కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి అంకితం చేశారని అన్నారు. తన హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సందర్భంలో ప్రజలు ఇచ్చిన డబ్బును కూడా సిఐటియు ఉద్యమానికి విరాళంగా ఇచ్చారని కార్మిక ఉద్యమం పట్ల అంతటి బాధ్యతతో పనిచేశారని గుర్తు చేశారు. నిరుపేద కుటుంబంలో పుట్టి కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగిన పర్స తన జీవితాంతం నిరాడంబరంగా జీవించాలని కమ్యూనిస్టు విలువలతో జీవించాడని తెలిపారు. పర్సా జీవితం నేటి తరానికి ఆదర్శం అని తెలిపారు.
అధ్యయనం ద్వారానే నాన్న కమ్యూనిస్టు నాయకుడు అయ్యారు, పర్సా సత్యనారాయణ కూతురు లీల.. కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేసేటప్పుడు అనేక కష్టాలు ఆటుపోట్లను ఎదుర్కొన్నాడని, ప్రభుత్వాల నిర్బంధంలో కూడా బంధించబడ్డాడని అయినా ఏనాడు తాను కుంగి పోలేదని తెలిపారు. నిరంతరం అధ్యయనం ద్వారా తనను తాను నాయకుడుగా తీర్చిదిద్దుకొని కార్మిక సమస్యల పట్ల స్పష్టమైన అవగాహనతో పనిచేసేవారని తెలిపారు. అధ్యయనం ద్వారానే కార్మికులకు పాఠాలు నేర్పించగలమని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జరిపే పోరాటంలో ప్రభుత్వ విధానాల అర్థం చేసుకోకుండా కార్మిక వర్గాన్ని కదిలించలేమని చెబుతూ ఉండేవారని అన్నారు. అధ్యయనమే పోరాటానికి పురికొల్పుతోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య,ఎజె రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం జ్యోతి, అన్నవరపు సత్యనారాయణ, నర్సారెడ్డి, బ్రహ్మచారి,కారం పుల్లయ్య, లిక్కి బాలరాజు ,రేపాకుల శ్రీనివాస్, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మంద నరసింహరావు,సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ధర్మ, నబి, వీర్ల రమేష్,భూక్య రమేష్,కొండబోయిన వెంకటేశ్వర్లు, కోబల్, నిమ్మల వెంకన్న, ముదిగొండ రాంబాబు, సున్నం గంగ, మర్మం చంద్రయ్య,యాస నరేష్, తులసిరామ్ తదితరులు పాల్గొన్నారు.




