Kothagudem: సారంపల్లి మల్లారెడ్డికి సీపీఎం నేతల ఘన నివాళి
Kothagudem: అఖిలభారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి మృతికి సీపీఎం జిల్లా కమిటీ నివాళి. దేహదానం చేసి మానవతను చాటారని కనకయ్య కొనియాడారు.
Kothagudem: సారంపల్లి మల్లారెడ్డికి సీపీఎం నేతల ఘన నివాళి
కొత్తగూడెం: సీనియర్ కమ్యూనిస్టు నాయకులు, అఖిలభారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి, ముఖ్యంగా రైతాంగ ఉద్యమానికి తీరని లోటని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య అన్నారు. మల్లారెడ్డి మృతికి సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ముందుగా ఆయన చిత్రపటానికి కనకయ్య పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కనకయ్య మాట్లాడుతూ.. 1973లో నర్సంపేట డివిజన్ రైతు సంఘం కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన మల్లారెడ్డి అనంతరం సీపీఎం పూర్తి కాలం కార్యకర్తగా పనిచేశారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా, సుదీర్ఘకాలం రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారని పేర్కొన్నారు. చివరి వరకు రైతు సంఘం కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారని తెలిపారు.
రైతాంగ ఉద్యమాలకు మల్లారెడ్డి దిక్సూచిగా నిలిచారని కనకయ్య కొనియాడారు. రైతు సమస్యలతో పాటు ప్రజా సమస్యలను లోతుగా అధ్యయనం చేసి, ఆ విషయ పరిజ్ఞానాన్ని కార్యకర్తలకు అందించడంలో ఆయన ప్రత్యేక నైపుణ్యం చూపారని అన్నారు. రైతాంగ ఉద్యమాలను నిర్మించడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు సాగునీటి వనరులపై విశేష అవగాహన కలిగిన నాయకుడిగా చెరగని ముద్ర వేశారని తెలిపారు.
భూస్వామ్య కుటుంబంలో జన్మించినప్పటికీ రైతులు, కార్మికులు, అట్టడుగు వర్గాల ప్రజల కోసం సీపీఎంలో పనిచేశారని, అనేక ప్రజా పోరాటాలకు నాయకత్వం వహించి దిశానిర్దేశం చేశారని కనకయ్య పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో ఆయన పాత్ర మరువలేనిదన్నారు. నిరాడంబర జీవితం ఆయన ప్రత్యేకతగా నిలిచిందని తెలిపారు.
బతికున్నంత కాలం ప్రజల కోసం పోరాడిన మల్లారెడ్డి, మరణానంతరం కూడా తన దేహం సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో గాంధీ ఆసుపత్రికి దేహదానం చేయడం ఆయన మానవతా దృక్పథానికి నిదర్శనమన్నారు. నేటి తరం కమ్యూనిస్టులు మల్లారెడ్డి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజా ఉద్యమాల్లో పనిచేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు లిక్కి బాలరాజు, నాయకులు సందకూరి లక్ష్మి, వై. వెంకటేశ్వరరావు, రమేష్ బాబు, నాగకృష్ణ, అభిమన్యు, పద్మ, సతీష్, రాములు తదితరులు పాల్గొన్నారు.




