Kothagudem: న్యుమోనియాపై అప్రమత్తత అవసరం: డీఎంహెచ్ఓ తుకారామ్ రాథోడ్!
Kothagudem: న్యుమోనియా వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సకాలంలో గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుందని భద్రాద్రి కొత్తగూడెం డీఎంహెచ్ఓ డాక్టర్ తుకారామ్ రాథోడ్ సూచించారు.
Kothagudem: న్యుమోనియాపై అప్రమత్తత అవసరం: డీఎంహెచ్ఓ తుకారామ్ రాథోడ్!
కొత్తగూడెం: న్యుమోనియా వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యాధి లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించి సకాలంలో చికిత్స పొందాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ సూచించారు. నవంబర్ 12న నిర్వహించే ప్రపంచ న్యుమోనియా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రజలకు ఈ వ్యాధిపై అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు.
న్యుమోనియా అనేది ఊపిరితిత్తులకు వచ్చే ఇన్ఫెక్షన్ అని, దీనివల్ల ఊపిరితిత్తుల్లోని గాలి సంచుల్లో ద్రవం లేదా చీము చేరి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయని తెలిపారు. ముఖ్యంగా ఐదేళ్లలోపు చిన్నపిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వివరించారు.
బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్ల వల్ల న్యుమోనియా సోకే అవకాశం ఉందని, దగ్గు, తుమ్ముల ద్వారా క్రిములు వ్యాపిస్తాయని పేర్కొన్నారు. జ్వరం, దగ్గు, చలి, వేగంగా శ్వాస తీసుకోవడం, ఛాతిలో నొప్పి, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. చిన్నపిల్లల్లో శ్వాస తీసుకునేటప్పుడు ఛాతి లోపలికి లాగబడటం, పాలు తాగలేకపోవడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదన్నారు.
న్యుమోనియా నివారణకు పిల్లలకు ప్రభుత్వ టీకాల కార్యక్రమంలో భాగంగా న్యుమోకాకల్ (PCV), పెంటావాలెంట్, మీజిల్స్ తదితర టీకాలను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం వేయించాలని సూచించారు. శిశువులకు మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, పిల్లలకు పౌష్టికాహారం అందించాలని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవడం, ఇళ్లలో గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవడం, పొగతాగడం మానుకోవడం ద్వారా వ్యాధి ముప్పును తగ్గించవచ్చన్నారు.
శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది, పెదవులు లేదా నాలుక నీలం రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందాలని డీఎంహెచ్ఓ సూచించారు. వ్యాధిని ముందుగానే గుర్తించి సరైన చికిత్స అందిస్తే ప్రాణాపాయాన్ని నివారించవచ్చని డాక్టర్ తుకారామ్ రాథోడ్ స్పష్టం చేశారు.




