Kothagudem: కొత్తగూడెంలో అట్టహాసంగా మహంకాళి అమ్మవారి రథోత్సవం

Kothagudem: కొత్తగూడెం బూడిదగడ్డ బస్తీ మహంకాళి ఆలయంలో వైభవంగా ఆషాడ మాస బోనాల రథోత్సవం. రథాన్ని లాగిన మేయర్ మూడు గణేష్, భక్తులు. ఆదివారం ప్రధాన బోనాలు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 31 July 2026 4:59 PM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెంలో అట్టహాసంగా మహంకాళి అమ్మవారి రథోత్సవం

కొత్తగూడెం: కొత్తగూడెంలో ఘనంగా ఆషాడ మాస బోనాల జాతర మహోత్సవాలు.. బూడిదగడ్డ బస్తీలో కొలువై ఉన్న శ్రీశ్రీశ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయంలో.. ఆషాడ మాస బోనాల జాతర మహోత్సవాల సందర్భంగా నేడు అమ్మవారి రథోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు.

వివిధ రాష్ట్రాలకు చెందిన డప్పు, డోలు కళాకారుల మేళా తాళాలు,స్థానిక శివసత్తుల పూనకాలు, విచిత్ర వేషధారణలతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొన్నది. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో కళాకారులు తమ కళా ప్రదర్శనలు నిర్వహించారు. కొద్దిమంది మహిళా భక్తులు అమ్మవారి పూనకాలతో ఊగిపోయారు.

విశేష పూజా కార్యక్రమాల అనంతరం అమ్మవారిని ఆలయ పూజారులు నరేంద్ర భవాని, రాధాకృష్ణ శర్మ, రథం పైకి తీసుకువచ్చారు. డప్పు డోలు మంగళ వాయిద్యాలతో ,శివసత్తుల విన్యాసాలు కళాకారుల విచిత్ర వేషధారణలతో కళాబృందాలతో అమ్మవారి రథోత్సవాన్ని పట్టణంలో అత్యంత వైభవంగా శోభాయ మానంగా నిర్వహించారు.

కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడు గణేష్ , కార్పొరేటర్లు ప్రజా ప్రతినిధులు, మహిళా భక్తులు రథాన్ని లాగి తమ భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుంచి సైతం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

ఈ సందర్భంగా పూజారి శ్రీ రాధాకృష్ణ శర్మ, ఆలయ పూజారి నరేంద్ర భవాని మాట్లాడుతూ శ్రీ శ్రీ శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆషాడ మాస బోనాల జాతర రథోత్సవం ప్రతి సంవత్సరం దేదీప్యమానంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

అనాదిగా మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆషాడ మాస బోనాల ఉత్సవాలు విశేషంగా జరుగుతున్న నేపథ్యంలో బుధవారం నుంచి ఆదివారం వరకు ఐదు రోజులపాటు ఆషాడ మాస బోనాల జాతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఆదివారం రోజు ప్రధానంగా అమ్మవారికి బోనాలు సమర్పణ, చండీహోమం నిర్వహించటం జరుగుతుందని, ఆనాడు వేలాదిమంది భక్తులకు నారాయణ సేవ అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు మొక్కులు చెల్లించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story