Kothagudem: సుజాతనగర్‌లో విమానాశ్రయ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌లో 667 ఎకరాల్లో విమానాశ్రయం ఏర్పాటుకు ఏఏఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో భూసేకరణ పనులు ప్రారంభం కానున్నాయి.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 14 Nov 2026 10:56 PM IST
Kothagudem
X

Kothagudem: సుజాతనగర్‌లో విమానాశ్రయ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజల ఏళ్లనాటి విమానాశ్రయ కల సాకారమయ్యే దిశగా కీలక ముందడుగు పడింది. సుజాతనగర్ మండల పరిధిలో 667 ఎకరాల విస్తీర్ణంలో విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్ర విమానయాన శాఖ నుంచి సానుకూల సంకేతాలు అందాయి. జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటుకు అనువైన ప్రాంతాలపై అధ్యయనం చేసిన ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) బృందం సుజాతనగర్ ప్రాంతాన్ని తుది ఎంపిక చేసినట్లు సమాచారం.

జిల్లాలోని పెనగడప, పాల్వంచ-దుమ్ముగూడెం, బూర్గంపాడు, దుమ్ముగూడెం, సీతంపేట, సుజాతనగర్ ప్రాంతాల్లో భూమి లభ్యత, వాతావరణం, వరద ముప్పు తదితర అంశాలపై ఏఏఐ బృందం సర్వే నిర్వహించింది. ఈ పరిశీలనలో సుజాతనగర్ వద్ద 667 ఎకరాల భూమి విమానాశ్రయ నిర్మాణానికి అనుకూలంగా ఉన్నట్లు గుర్తించి ఫీజిబిలిటీ నివేదికను కేంద్రానికి సమర్పించింది. ఈ మేరకు ఏఏఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక సమాచారం అందినట్లు తెలుస్తోంది.

విమానాశ్రయ సాధన కోసం కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అసెంబ్లీ వేదికగా పలుమార్లు ప్రస్తావించడంతో పాటు ఢిల్లీ స్థాయిలో కేంద్ర మంత్రులు, అధికారులతో సంప్రదింపులు జరిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం సాధిస్తూ విమానాశ్రయ ఏర్పాటుకు ప్రత్యేక చొరవ చూపారు. ఆయన చేసిన నిరంతర ప్రయత్నాలు ఫలించి ప్రాజెక్టు ముందడుగు వేయడంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

*ప్రయాణ సౌకర్యాలకు అనుకూలం..*

సుజాతనగర్‌లో ఎంపిక చేసిన ప్రాంతం ప్రధాన రహదారికి 3.4 కిలోమీటర్లు, కొత్తగూడెం రైల్వే స్టేషన్‌కు 5.7 కిలోమీటర్లు, భద్రాచలానికి 35.4 కిలోమీటర్ల దూరంలో ఉండటం విమాన ప్రయాణికులకు అనుకూలంగా మారనుంది. విమానాశ్రయం అందుబాటులోకి వస్తే జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి, పర్యాటక రంగం, వాణిజ్యం, ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది.

కేంద్ర స్థాయిలో సానుకూల పరిణామాలు చోటుచేసుకోవడంతో తదుపరి దశలో భూసేకరణ, ఇతర సాంకేతిక, పరిపాలనా ప్రక్రియలపై కసరత్తు ప్రారంభం కానుంది. ఏళ్లనాటి కల సాకారమయ్యే దిశగా అడుగులు పడటంతో జిల్లా ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM