Tadakalapudi: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
Tadakalapudi: భద్రాద్రి కొత్తగూడెం టేకులపల్లి తడకలపూడిలో బాల్య వివాహాల నిర్మూలనపై న్యాయ అవగాహన, ర్యాలీ; జడ్జి ఎం. రాజేందర్ సూచనలు, పోక్సో చట్టంపై వివరణ.
Tadakalapudi: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
టేకులపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో టేకులపల్లి మండలం తడకలపూడి గ్రామ పంచాయతీలో శుక్రవారం బాల్య వివాహాల నిర్మూలనపై న్యాయ అవగాహన కార్యక్రమం మరియు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి (సీనియర్ సివిల్ జడ్జి) ఎం. రాజేందర్ మాట్లాడుతూ, బాల్య వివాహాలు బాలల భవిష్యత్తును దెబ్బతీయడమే కాకుండా వారి ఆరోగ్యం, విద్య, మానసిక వికాసంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, బాల్య వివాహాలను అరికట్టడంలో గ్రామ ప్రజలు, యువత, ప్రజాప్రతినిధులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
అలాగే పాఠశాల విద్య మధ్యలోనే మానివేసి గంజాయి, మత్తు పదార్థాలు, డ్రగ్స్‌కు అలవాటు పడుతున్న విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. పోక్సో చట్టం ప్రాధాన్యత, బాలలపై లైంగిక నేరాలకు పాల్పడితే ఎదురయ్యే కఠినమైన చట్టపరమైన పరిణామాల గురించి గ్రామ ప్రజలకు వివరించారు. గ్రామంలో గుర్తించిన పాఠశాల మానేసిన పిల్లలను తిరిగి విద్యా వ్యవస్థలోకి తీసుకురావాలని, సంబంధిత సీడబ్ల్యూసీ, డీడబ్ల్యూఓ అధికారుల సమన్వయంతో అవసరమైన పిల్లలకు వసతి గృహాల్లో ప్రవేశం కల్పించి వారి విద్య కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం తడకలపూడి గ్రామ పంచాయతీ నుంచి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వరకు బాల్య వివాహాల నిర్మూలన నినాదాలతో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో CWC సభ్యులు అంబేద్కర్, టేకులపల్లి ఎస్.ఐ తిరుపతి, గ్రామ సర్పంచ్ బిక్షి రాములు, ఉపసర్పంచ్ వాసం సీత అంగన్వాడీ సూపర్ వైజర్ బి. నిర్మల, గ్రామ కార్యదర్శి దీప్తి, 1098 హెల్ప్‌లైన్ సూపర్వైజర్ లలిత, పారా లీగల్ వాలంటీర్లు చరణ్ కుమార్, బి. భారతి, పి. రాజకుమారి , వీవో డ్వాక్రా ప్రతినిధి రత్నకుమారి, AID ఎన్జీవో ప్రతినిధి మాన్‌సింగ్,అంగన్వాడీ సూపర్ వైజర్స్, అంగన్వాడీ టీచర్స్ , ఆశా కార్యకర్తలు, గ్రామ ప్రజలు, యువత, రైతులు తదితరులు పాల్గొన్నారు.




