Kothagudem: రూ.8.75 కోట్లతో సుజాతనగర్‌లో తెలంగాణ పబ్లిక్ స్కూల్

Kothagudem: సుజాతనగర్‌లో రూ.8.75 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరైనట్లు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఉచిత ఇంగ్లీష్ విద్య.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 10 Oct 2026 8:29 PM IST
Kothagudem
X

Kothagudem: రూ.8.75 కోట్లతో సుజాతనగర్‌లో తెలంగాణ పబ్లిక్ స్కూల్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: సుజాతనగర్ మండల కేంద్రానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరైందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. జీవో నంబర్ 187 ద్వారా పాఠశాల మంజూరైందని, అభివృద్ధి పనుల కోసం రూ.8.75 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. శనివారం సుజాతనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ పాఠశాలలో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఉచితంగా ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన అందించనున్నట్లు తెలిపారు. అత్యాధునిక సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌లు, లైబ్రరీ, డిజిటల్ వసతులు, క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తామన్నారు. విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నాలుగైదు రోజుల్లో పాఠశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు.

జిల్లాలో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు పట్టువదలకుండా కృషి చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నాయకులగూడెం నుంచి సుజాతనగర్ వరకు సెంట్రల్ లైటింగ్‌తో నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. సుజాతనగర్ ప్రధాన రహదారికి ఇరువైపులా డ్రైనేజీలు, మోడల్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపడతామన్నారు.

మహిళలకు స్థానికంగా ఉపాధి కల్పించేందుకు గృహ పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కూరగాయలు, మిర్చి సాగుకు అనుగుణంగా కోల్డ్ స్టోరేజీలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు అవకాశాలున్నాయని చెప్పారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని కూనంనేని కోరారు.

ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, డీఈవో వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డు చైర్మన్ లాల్ సింగ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM