Kothagudem: విజయ విఘ్నేశ్వర ఆలయంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు
Kothagudem: కొత్తగూడెం శ్రీ విజయ విఘ్నేశ్వర ఆలయంలో వైభవంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు. పూజలు చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.
Kothagudem: విజయ విఘ్నేశ్వర ఆలయంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. వినాయక చవితిని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్వామివారికి విఘ్నేశ్వర పూజ నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు.
విజయాలను ప్రసాదించే విఘ్నేశ్వర స్వామిగా భక్తుల విశ్వాసాన్ని పొందిన స్వామివారికి ఈ నెల 25వ తేదీ వరకు ప్రతిరోజూ ప్రత్యేక అలంకరణలు నిర్వహించనున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ గణపతి హోమం నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
ఈ నెల 18వ తేదీన స్వామివారి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. 21వ తేదీ సోమవారం సాయంత్రం 6 గంటలకు స్వామివారి రథోత్సవాన్ని పురవీధుల్లో అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. 24వ తేదీ రాత్రి స్వామివారి మహాలడ్డు వేలంపాట జరగనుంది.
25వ తేదీ ఉదయం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించి, సాయంత్రం స్టేడియంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం స్వామివారిని పురవీధుల్లో ఊరేగిస్తూ భక్తులకు దర్శనం కల్పించి, నిమజ్జనం కోసం భద్రాచలం వద్ద గోదావరి నదికి తరలించనున్నారు.
గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ నిర్వాహకులు కోరారు.




