Kothagudem: కొత్తగూడెం రామవరం మాతా శిశు కేంద్రంలో నవజాత ఆడశిశువు మృతి

Kothagudem: కొత్తగూడెం జిల్లా రామవరం మాతా శిశు కేంద్రంలో నవజాత ఆడశిశువు మృతి చెందడం కలకలం రేపింది.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 27 Aug 2026 11:34 PM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెం రామవరం మాతా శిశు కేంద్రంలో నవజాత ఆడశిశువు మృతి

కొత్తగూడెం: రామవరంలోని మాతా శిశు కేంద్రంలో నవజాత ఆడశిశువు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ములకలపల్లి గ్రామానికి చెందిన విజయలక్ష్మి ప్రసవం కోసం ఆసుపత్రికి రాగా ఆడశిశువుకు జన్మనిచ్చింది. అనంతరం శిశువుకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడినప్పటికీ సకాలంలో వైద్య సేవలు అందలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

అయితే ఘటన జరిగిన రోజు విధుల్లో ఉన్న డ్యూటీ వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో మరో వైద్యుడిని వివరణ కోరగా.. శిశువు పాలు తాగిన అనంతరం మిల్క్‌ ఆస్పిరేషన్‌ కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి మృతి చెందినట్లు తెలిపారు. పాలు తాగిన తర్వాత నవజాత శిశువును తల్లి సంరక్షణలో ఉంచుతూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని వైద్యుడు వివరించారు.

అయితే వైద్యుల వివరణపై శిశువు కుటుంబ సభ్యులు, స్థానికులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. శిశువుకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడిన సమయంలో వైద్య సిబ్బంది సకాలంలో స్పందించారా? అత్యవసర వైద్యం అందించడంలో ఏమైనా జాప్యం జరిగిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయంపై అధికారిక విచారణ జరిగితేనే అసలు కారణాలు స్పష్టమవుతాయని వారు పేర్కొంటున్నారు.

మౌలిక వసతులపై ఆరోపణలు

మాతా శిశు కేంద్రంలో తాగునీటి సౌకర్యం సక్రమంగా లేదని, బాలింతలు బయట నుంచి నీటిని కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. బాత్రూమ్‌లు, పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య సమస్యలు ఉన్నాయని, సిబ్బందిలో కొందరు రోగులు, బాలింతలతో దురుసుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

సమగ్ర విచారణకు డిమాండ్

నవజాత శిశువు మృతి ఘటనపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు. వైద్య నిర్లక్ష్యం జరిగినట్లు విచారణలో తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో ఆసుపత్రిలో వైద్య సిబ్బంది అందుబాటు, అత్యవసర వైద్య సేవలు, తాగునీరు, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని కోరుతున్నారు.

మాతా శిశు కేంద్రంపై వస్తున్న ఆరోపణలపై ఉన్నతాధికారులు దృష్టి సారించి, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story