Kothagudem: ఘనంగా తెలుగు భాషా, జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు
Kothagudem: కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు.
Kothagudem: ఘనంగా తెలుగు భాషా, జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు
కొత్తగూడెం: గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవాన్ని, హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవాన్ని కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ ఉన్నత పాఠశాలలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గిడుగు రామమూర్తి, మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కార్యక్రమానికి సింగరేణి కాలరీస్ పాఠశాలల అధినేత, జనరల్ మేనేజర్ (పర్సనల్), SCCS కార్యదర్శి జి. రాజేంద్ర ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. క్రీడలు, యోగా పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం పాఠశాలలోని గ్రంథాలయం, డిజిటల్ తరగతులు, కంప్యూటర్ విభాగం, పరీక్షల విభాగం, మధ్యాహ్న భోజన వంటశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జి. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తెలుగు మన మాతృభాష అని, ఇతర భాషలను నేర్చుకుంటూనే మాతృభాషను గౌరవించాలని విద్యార్థులకు సూచించారు. మాతృభాషను ఎప్పటికీ మరచిపోవద్దని, విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యానికి క్రీడలు ఎంతో అవసరమని తెలిపారు.
ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయురాలు సీర ప్రసన్న మాట్లాడుతూ విద్యార్థులు తెలుగు భాషపై మక్కువ పెంచుకోవాలని, సెల్ఫోన్లకు దూరంగా ఉంటూ ప్రతిరోజూ క్రీడల్లో పాల్గొనాలని సూచించారు.
ప్రైమరీ ఇన్చార్జ్ ధనలక్ష్మి, తెలుగు ఉపాధ్యాయులు పి. స్వర్ణకుమారి, కె. సుజాత తదితరులు తెలుగు భాష ప్రాశస్త్యాన్ని వివరించారు. వ్యాయామ ఉపాధ్యాయులు లావణ్య, సంజయ్ క్రీడల ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వక్తృత్వం, తెలుగులో అనర్గళంగా మాట్లాడటం తదితర పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.
కార్యక్రమంలో పాఠశాల బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు.




