Kothagudem: కొత్తగూడెం విజయ విఘ్నేశ్వరాలయంలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం విజయ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ స్వర్ణ దుర్గ అమ్మవారు బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 11 Oct 2026 10:57 PM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెం విజయ విఘ్నేశ్వరాలయంలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు!

కొత్తగూడెం: కొత్తగూడెం పట్టణంలోని శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం నందు శ్రీ స్వర్ణ దుర్గ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం మంగళ వాద్యములు, తీర్థపు బిందె, నిత్యార్చన జరిపారు. అమ్మవారికి పంచామృత స్నపనము, పీఠార్చన, అనుష్టానం, విశేష హోమము, చండీ హోమం ఆలయంలో నిర్వహించారు.

మధ్యాహ్నం 3 గంటల నుంచి కుంకుమార్చన, శ్రీ చక్ర నవావరణార్చన, మహాలక్ష్మి, దుర్గా, చండీ సప్తశతీ పారాయణ, అనుష్టానములు, పీఠ పూజ నిర్వహించారు. రాత్రి 8 గంటలకు అమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

నిత్య కళ్యాణ స్వరూపిణి, అరుణవర్ణము కలిగి జపమాల, పుస్తకము, అభయ వరద ముద్రలతో కనిపించే శ్రీ బాలాత్రిపుర సుందరీ అమ్మవారిని ఆరాధిస్తే మానసిక ప్రశాంతత కలిగి సుఖ సంతోషాలతో పాటు అణిమాది అష్టసిద్ధులను పొందగలరని అర్చకులు తెలిపారు.

అనంతరం రాత్రి 10 గంటలకు మహా హారతి, ఆలయ బంధనంతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారని ఆలయ కార్యనిర్వాహణాధికారి తెలిపారు..

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM