Burgampadu: సారపాకలో ఐటీసీ వ్యర్థజలాలపై భగ్గుమన్న నిరసనలు!

Burgampadu: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో ఐటీసీ వ్యర్థజలాల కాలుష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు. నిబంధనలు పాటించాలంటూ డిమాండ్.

RAVI, BURGAMPAD AREA
Published on: 5 Oct 2026 12:33 PM IST
Burgampadu
X

Burgampadu: సారపాకలో ఐటీసీ వ్యర్థజలాలపై భగ్గుమన్న నిరసనలు!

Burgampadu: ఐటీసీ పరిశ్రమ నుంచి వెలువడుతున్న వ్యర్థజలాలపై సారపాక గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యంతో కూడిన వ్యర్థజలాలు బయటకు వస్తున్నాయని, దీంతో పరిసర ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థజలాలను నిబంధనల ప్రకారం శుద్ధి చేసిన అనంతరం మాత్రమే విడుదల చేయాల్సి ఉండగా.. అసలు వ్యర్థజలాలను పూర్తిస్థాయిలో శుద్ధి చేస్తున్నారా? నిబంధనలు పాటిస్తున్నారా? అంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. వ్యర్థజలాల కారణంగా దుర్వాసనతో పాటు పరిసర ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని వారు చెబుతున్నారు.

పరిశ్రమల అభివృద్ధిని ఎవరూ వ్యతిరేకించడం లేదని, కానీ అభివృద్ధి పేరుతో ప్రజల ఆరోగ్యం, పర్యావరణానికి ఇబ్బందులు కలగకూడదని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. కాలుష్యంపై అధికారులు నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే స్పందించి వాస్తవాలను వెలుగులోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు.

వ్యర్థజలాల విడుదలపై సంబంధిత కాలుష్య నియంత్రణ అధికారులు తనిఖీలు నిర్వహించారా? శుద్ధి ప్రక్రియ నిబంధనల ప్రకారమే జరుగుతోందా? అన్న అంశాలపై సమగ్ర పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.

సారపాకలో ఐటీసీ వ్యర్థజలాలపై వెల్లువెత్తుతున్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు స్పందించి, కాలుష్యంపై వాస్తవాలను బయటపెట్టి ప్రజలకు స్పష్టత ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

RAVI, BURGAMPAD AREA

RAVI, BURGAMPAD AREA