Palwancha: కిసాన్ సభ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి: అన్నవరపు సత్యనారాయణ

Palwancha: నల్లగొండలో నవంబర్ 15–18 తేదీల్లో జరిగే అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ పిలుపునిచ్చారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 13 Nov 2026 10:47 PM IST
Palwancha
X

Palwancha: కిసాన్ సభ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి: అన్నవరపు సత్యనారాయణ

పాల్వంచ: నల్లగొండ పట్టణంలో నవంబర్ 15, 16, 17, 18 తేదీల్లో జరగనున్న అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ రైతాంగానికి పిలుపునిచ్చారు. ఈ మహాసభలకు జిల్లా నుంచి సుమారు 6 వేల మంది రైతులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

శుక్రవారం పాల్వంచ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 1936లో లక్నోలో ఏర్పాటైన అఖిల భారత కిసాన్ సభ దేశ స్వాతంత్ర్య ఉద్యమంతో పాటు రైతాంగ హక్కుల సాధన కోసం కీలక పాత్ర పోషించిందన్నారు. బ్రిటిష్ వలస పాలన, జమీందారీ, జాగీర్దారీ వ్యవస్థలకు వ్యతిరేకంగా రైతులను సంఘటితం చేసి వారి హక్కుల కోసం పోరాటాలు నిర్వహించిన చరిత్ర ఆ సంఘానికి ఉందన్నారు.

రైతులకు భూమిపై హక్కులు కల్పించాలని, దున్నేవారికే భూమి దక్కాలని సాగించిన ఉద్యమాలతో పాటు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, వర్లీ ఆదివాసీ పోరాటం, తెభాగా ఉద్యమం వంటి అనేక రైతాంగ పోరాటాల్లో ఏఐకేఎస్ కీలకంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం అనంతరం భూసంస్కరణలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, భూమి పంపిణీ వంటి డిమాండ్లపై దేశవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహించి లక్షలాది ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేయడంలో కీలక పాత్ర పోషించిందన్నారు.

కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన విధానాలను తీసుకొచ్చేందుకు ప్రయత్నించిందని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధరకు చట్టబద్ధమైన హామీ కల్పించకుండా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించే విధానాలను అమలు చేయాలని చూసిందన్నారు. దీనికి వ్యతిరేకంగా రైతులు 13 నెలల పాటు సుదీర్ఘ పోరాటం నిర్వహించి మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయించారని గుర్తుచేశారు.

ప్రస్తుతం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల పేరుతో విదేశీ బహుళజాతి కంపెనీల వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇలాంటి విధానాల వల్ల దేశీయ రైతాంగానికి నష్టం కలిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలను తిప్పికొట్టి, రైతాంగ సమస్యలపై నిరంతర పోరాటాలకు కార్యాచరణ రూపొందించేందుకు 36వ జాతీయ మహాసభలు వేదికగా నిలుస్తాయని తెలిపారు. నవంబర్ 15న నిర్వహించే భారీ బహిరంగ సభకు జిల్లా రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని రైతు సంఘం ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నామని సత్యనారాయణ తెలిపారు. జిల్లాలో ప్రాజెక్టు ఉన్నప్పటికీ ఇక్కడి రైతాంగానికి సాగునీరు అందించే విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన పదవీకాలం ముగిసేలోపు సత్తుపల్లి ప్రాంతానికి నీటిని తరలించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవసరమైన నిధులు కేటాయించకుండా, కాలువల నిర్మాణాన్ని పూర్తి చేయకుండా జాప్యం చేస్తున్నారని అన్నారు. దీనివల్ల జిల్లా రైతాంగానికి నష్టం జరుగుతోందని పేర్కొన్నారు.

సీతారామ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను నల్లగొండలో జరిగే రాష్ట్ర మహాసభల్లో చర్చించి, జిల్లా రైతాంగానికి న్యాయం జరిగేలా పోరాట కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.

ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎలమంచిలి వంశీకృష్ణ, రాష్ట్ర సీనియర్ నాయకుడు కున్సోత్ ధర్మ, రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండబోయిన వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యుడు వాంకుడోత్ కోబల్, పాల్వంచ మండల కార్యదర్శి దాసరి వీరయ్య (శంకరన్న) తదితరులు పాల్గొన్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN