Manuguru: మణుగూరు ఓపెన్ కాస్ట్ విస్తరణ ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి ఆమోదం!

Manuguru: మణుగూరు ఓపెన్ కాస్ట్ విస్తరణ ప్రాజెక్ట్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి కమిటీ ఆమోదం. 149 మందికి రూ.8.19 కోట్ల ఆర్థిక సహాయం మంజూరు. కలెక్టర్ అంకిత్ వెల్లడి.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 11 Nov 2026 8:59 AM IST
Manuguru
X

Manuguru: మణుగూరు ఓపెన్ కాస్ట్ విస్తరణ ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి ఆమోదం!

Manuguru: మణుగూరు ఓపెన్ కాస్ట్ విస్తరణ ప్రాజెక్టు, మణుగూరు గ్రామానికి సంబంధించి జిల్లా స్థాయి పునరావాసం మరియు పునరుద్ధరణ (ఆర్ అండ్ ఆర్) కమిటీ సమావేశం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అంకిత్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, ఐటీడీఏ పీవో రాహుల్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మణుగూరు గ్రామానికి సంబంధించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు, అర్హులైన కుటుంబాల గుర్తింపు, ఆర్థిక సహాయం మంజూరు తదితర అంశాలపై కమిటీ సమగ్రంగా చర్చించింది. అధికారుల సమర్పించిన వివరాలను పరిశీలించిన అనంతరం మణుగూరు గ్రామానికి చెందిన 71 కుటుంబాలకు సంబంధించి గుర్తించిన 149 మంది లబ్ధిదారులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ఒక్కొక్కరికి రూ.5.50 లక్షల చొప్పున మొత్తం రూ.8,19,50,000 (రూ.8 కోట్ల 19 లక్షల 50 వేల) ఆర్థిక సహాయం మంజూరు చేయడానికి కమిటీ నిర్ణయం తీసుకుంది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, ప్రాజెక్టు కారణంగా ప్రభావితమవుతున్న కుటుంబాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునరావాసం, పునరుద్ధరణ ప్యాకేజీ ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. లబ్ధిదారుల వివరాలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా పారదర్శకంగా వ్యవహరించాలని తెలిపారు. భూసేకరణ, పరిహారం, పునరావాసం అంశాల్లో ఎలాంటి వివాదాలకు తావులేకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, మణుగూరు ఓపెన్ కాస్ట్ విస్తరణ ప్రాజెక్టు వల్ల ప్రభావితమవుతున్న కుటుంబాలకు నిబంధనల ప్రకారం న్యాయం జరగాలని, అర్హులైన లబ్ధిదారులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ప్రయోజనాలు సకాలంలో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధిత కుటుంబాల సమస్యలను సానుకూలంగా పరిశీలించి పరిష్కరించాలని తెలిపారు.

ఈ సమావేశంలో భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, సింగరేణి మణుగూరు జనరల్ మేనేజర్, భూసేకరణ అధికారి, మణుగూరు తహసీల్దార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA