Khammam: కూసుమంచి మండలంలో మంత్రి పొంగులేటి 16.13 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Khammam: పాలేరు నియోజకవర్గ పరిధిలోని కూసుమంచి మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం విస్తృతంగా పర్యటించారు
Khammam: వాన పడినా ఆగని ప్రగతి.. తండాల రవాణా కష్టాలు తీర్చడమే ధ్యేయమన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
కూసుమంచి: ఆకాశం నుంచి వర్షపు చినుకులు నేలను తాకుతున్నా.. వాతావరణం అనుకూలించకపోయినా లెక్కచేయకుండా, గ్రామీణ రవాణా కష్టాలను తీర్చడమే ధ్యేయంగా ప్రగతి బాట సాగింది. పాలేరు నియోజకవర్గ పరిధిలోని కూసుమంచి మండలంలో శనివారం తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించారు.
ఒకవైపు చిరుజల్లులు కురుస్తున్నా... వర్షపు చినుకుల సాక్షిగానే దుబ్బతండా, లాల్ సింగ్ తండా, జీళ్ళచెరువు గ్రామాల్లో రూ. 16.13 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్లు, వంతెనల నిర్మాణ పనులకు మంత్రి పొంగులేటి శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ.. వర్షాకాలంలో తండాలు, పల్లె ప్రజలు బురద రోడ్లు, ఉధృతంగా ప్రవహించే వాగుల వల్ల బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోకుండా ఉండేందుకే ఈ పనులను త్వరితగతిన మంజూరు చేయించామని పేర్కొన్నారు.
వానలు పడుతున్నా ప్రజల కోసం ప్రగతి పనులు ఆపబోమని, అధికారులు కూడా అంతే వేగంతో నాణ్యతా ప్రమాణాలతో, నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు.- రూ. 16.13 కోట్లతో శంకుస్థాపనలు..
మంత్రి పొంగులేటి తన పర్యటనలో భాగంగా దుబ్బతండా గ్రామంలో జడ్పీ రోడ్డు గైగోల్లపల్లి నుంచి దుబ్బతండా వరకు రూ. 2.10 కోట్ల అంచనా వ్యయంతో, అలాగే జడ్పీ రోడ్డు నుండి కొత్తూరు - ఎర్రగడ్డ తండా మీదుగా దుబ్బతండా వరకు రూ. 4.50 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే బీటీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం లాల్ సింగ్ తండా నుంచి నేరేడువాయి వరకు రూ. 2.03 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు, జీళ్ళచెరువు గ్రామంలో జీళ్ళచెరువు మీదుగా కొండాపురం నుంచి మోటాపురం వెళ్ళే ప్రధాన రహదారిపై రూ. 7.50 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన రెండు వంతెనల (బ్రిడ్జిల) నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ పర్యటనలో మంత్రి వెంట జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, వివిధ శాఖల జిల్లా, నిజయోజక, మండల స్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




