Sathupally: అర్హులైన ప్రతి పేదవాడికీ ఇందిరమ్మ ఇల్లు.. రాజకీయం చూడబోం!

Sathupally: సత్తుపల్లి ప్రజా దర్బార్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. గులాబీ (పింక్) రంగు కండువా వేసుకున్న పేదవాడికైనా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, ధరణి సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 21 May 2026 12:25 PM IST
Sathupally
X

Sathupally: అర్హులైన ప్రతి పేదవాడికీ ఇందిరమ్మ ఇల్లు.. రాజకీయం చూడబోం!

సత్తుపల్లి (ఖమ్మం జిల్లా): ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ఎంఆర్ గార్డెన్‌లో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు పడిన కష్టాల ఫలితంగానే నేడు ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు.

ఇందులో భాగంగా పేదలకు సన్నబియ్యం పంపిణీ, తెల్ల రేషన్ కార్డుల మంజూరు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం వంటి కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. పేద కుటుంబాల పిల్లలకు విద్యా, ఆర్థిక భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

“పింక్ కలర్ వేసుకున్న ప్రతి పేదవాడికీ కూడా ఇందిరమ్మ ఇల్లు అందిస్తాం” అని మంత్రి స్పష్టం చేశారు. వర్షాకాలం రాకముందే రెవెన్యూ, అటవీ శాఖలు సమస్యాత్మక భూములను సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లను నాలుగు విడతలుగా మంజూరు చేస్తామని తెలిపారు.

ములకలపల్లి ప్రాంతం నుంచి నాణ్యమైన ఇసుకను అందుబాటులోకి తీసుకువస్తామని, ధరణి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

“ప్రభుత్వమే మీ దగ్గరకు వస్తుంది.. మీ సమస్యలను వింటుంది.. సమస్య న్యాయమైనదైతే వెంటనే పరిష్కరిస్తుంది” అని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI

Next Story