Palvancha: కొత్తగూడెం జిల్లా భూ సమస్యలపై మంత్రి పొంగులేటి సీరియస్

Palvancha: కొత్తగూడెం సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్‌లో భూముల రీ-సర్వే, పోడు భూముల సమస్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 19 July 2026 11:53 AM IST
Palvancha
X

Palvancha: కొత్తగూడెం జిల్లా భూ సమస్యలపై మంత్రి పొంగులేటి సీరియస్

Palvancha: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూముల రీ-సర్వే పనుల పురోగతి, అటవీ–రెవెన్యూ భూ సమస్యల పరిష్కారం, పోడు భూముల అంశం, పాల్వంచ శ్రీనివాసగుట్ట అభివృద్ధిపై జిల్లా అధికారులతో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు.

సమావేశంలో జిల్లాలో 70 గ్రామాల్లో చేపడుతున్న భూముల రీ-సర్వే పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు. అధికారులు జిల్లాలో ప్రస్తుతం 14 గ్రామాల్లో రీ-సర్వే పనులు కొనసాగుతుండగా, వాటిలో ఐదు గ్రామాల్లో పనులు పూర్తయ్యాయని వివరించారు. మిగిలిన గ్రామాల్లో కూడా నిర్ణీత గడువులో రీ-సర్వే పూర్తి చేసేలా కార్యాచరణ చేపట్టాలని మంత్రి ఆదేశించారు.

పాల్వంచలో కొనసాగుతున్న సర్వే పనుల పురోగతిపై మంత్రి ప్రత్యేకంగా ఆరా తీశారు. ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసి చాలా కాలం గడిచినా పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. రీ-సర్వే పనుల్లో జాప్యాన్ని, పొరపాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పనుల్లో జాప్యానికి గల కారణాలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని, నిర్ణీత కాలవ్యవధిలో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

భూముల రీ-సర్వే ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని మంత్రి సూచించారు. జిల్లాలో అందుబాటులో ఉన్న సర్వేయర్లు, రోవర్ పరికరాలు, వాటి వినియోగం, సాంకేతిక సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకుని అవసరమైన చోట అదనపు వనరులు సమకూర్చాలని సూచించారు.

అటవీ–రెవెన్యూ భూ సమస్యల పరిష్కారంపై మంత్రి ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలను పోలీస్ శాఖ వారు గుర్తించి, ఆయా ప్రాంతాల్లో ఉన్న భూ వివాదాలు, అటవీ–రెవెన్యూ సమస్యలను సామరస్యపూర్వకంగా, చట్టబద్ధంగా పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ, అటవీ, పోలీసు శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. ప్రతి నెలా సమీక్ష సమావేశాలు నిర్వహించి పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

పోడు భూముల అంశంపై మాట్లాడుతూ, కొత్తగా పోడు సాగు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గతంలో పోడు సాగు చేస్తున్న వారి సమస్యలను ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా, మానవీయ కోణంలో పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

అనంతరం పాల్వంచలోని శ్రీనివాసగుట్ట అభివృద్ధిపై మంత్రి ప్రత్యేకంగా సమీక్షించారు. శ్రీనివాసగుట్టపై వెలసిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు సులభంగా చేరుకునే విధంగా రహదారి నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే శ్రీనివాసగుట్ట ప్రాంతాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేలా సమగ్ర ప్రణాళిక రూపొందించి, అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ జిల్లాలో భూముల రీ-సర్వే, అటవీ–రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చేపడుతున్న చర్యలను మంత్రికి వివరించారు. జిల్లాలో దశలవారీగా రీ-సర్వే పనులు కొనసాగుతున్నాయని, ప్రస్తుతం 14 గ్రామాల్లో పనులు చేపట్టగా ఐదు గ్రామాల్లో పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన గ్రామాల్లో కూడా నిర్ణీత గడువులో సర్వే పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నామని చెప్పారు. రెవెన్యూ, అటవీ, పోలీసు శాఖల సమన్వయంతో భూ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా రీ-సర్వే ప్రక్రియ నిర్వహిస్తున్నామని కలెక్టర్ వివరించారు.

ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, భద్రాచలం ఐటిడిఏ పిఓ రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట,అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా రెవెన్యూ అధికారి పద్మావతి, కొత్తగూడెం ఆర్డీవో మధు, డివిజనల్ అటవీ అధికారులు, రెవెన్యూ, అటవీ, పోలీసు శాఖల అధికారులు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

Next Story