Mulakalapally: నర్సు శిరీష కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సీతక్క!

Mulakalapally: నర్సు శిరీష దారుణ హత్య బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సీతక్క.. రూ.5 లక్షల సాయం, ఇందిరమ్మ ఇల్లు ప్రకటించిన ప్రభుత్వం.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 1 Sept 2026 5:16 PM IST
Mulakalapally
X

Mulakalapally: నర్సు శిరీష కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సీతక్క!

Mulakalapally: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చౌవిటిగూడెం గ్రామానికి చెందిన గిరిజన యువతి, నర్సు ఊకే శిరీష దారుణ హత్య ఘటనపై రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి మంత్రి సీతక్క మంగళవారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.

హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న శిరీషపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై డీజీపీతో పాటు పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు మంత్రి తెలిపారు. ఈ కేసులో నిందితుడికి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందని బాధిత కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.

శిరీష కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయం, ఇందిరమ్మ ఇల్లు, కుటుంబ సభ్యుల్లో ఒకరికి అవుట్‌సోర్సింగ్ ఉద్యోగం కల్పించనున్నట్లు మంత్రి ప్రకటించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి రూ.1 లక్ష, ఐటీడీఏ ద్వారా రూ.30 వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. అలాగే మంత్రి సీతక్క, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వ్యక్తిగతంగా రూ.1 లక్ష తక్షణ సాయంగా బాధిత కుటుంబానికి అందించారు.

ఈ ఘటనపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, చట్టబద్ధంగా బాధిత కుటుంబానికి అందాల్సిన పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కుటుంబానికి భూమి మంజూరు చేసే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రి వెల్లడించారు.

కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు అప్పగించి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని సీతక్క స్పష్టం చేశారు. ఉద్యోగాల కోసం నగరాలకు వచ్చే గిరిజన యువతుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

హైదరాబాద్‌లో త్వరలో కాల్ సెంటర్, ఎమర్జెన్సీ సెంటర్ ఏర్పాటు చేసి టోల్‌ఫ్రీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. శిరీష కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి సీతక్క ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

Next Story