Khammam: ఎల్‌నినో, ఆర్నాబ్ తుఫాన్‌పై అధికారులు అప్రమత్తంగా ఉండాలి!

Khammam: ఎల్‌నినో, ఆర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో తాగు, సాగునీటి పరిస్థితులపై ఖమ్మం కలెక్టరేట్‌లో అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 27 Oct 2026 12:46 PM IST
Khammam
X

Khammam: ఎల్‌నినో, ఆర్నాబ్ తుఫాన్‌పై అధికారులు అప్రమత్తంగా ఉండాలి!

Khammam: ఎల్‌నినో ప్రభావంతో సాగునీటి లభ్యత తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఆర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో పంటల రక్షణ, సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, తాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరా పరిస్థితులపై ఖమ్మం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావంతో సాగునీటి లభ్యతపై ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు నష్టపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాబోయే యాసంగి సీజన్‌లో రైతులు వరి సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపేలా ఇరిగేషన్ శాఖ అధికారులు గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు.

సాగునీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని సీతారామ ప్రాజెక్టు కెనాల్స్‌తో పాటు నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలో నీటిని పొదుపుగా వినియోగించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. కాలువల షట్టర్లు మూసి నీటిని నిల్వ ఉంచే అంశంపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు నిరంతర నీటి సరఫరా అందించేందుకు కిన్నెరసాని ప్రాజెక్టును ప్రత్యామ్నాయ వనరుగా వినియోగించే ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు.

ఆర్నాబ్ తుఫాన్ నేపథ్యంలో చేతికందిన పంటలు దెబ్బతినకుండా రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు. వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. పంటల ఉత్పత్తులు తగ్గినా రైతులకు మెరుగైన ధరలు లభించేలా మార్కెటింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని, పంటల కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో తాగునీటి సమస్యలు, విద్యుత్ కోతలు తలెత్తకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ప్రజలకు తాగునీరు, రైతులకు అవసరమైన సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని స్పష్టం చేశారు.

ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా, రైతులు సాగునీటి కొరతతో నష్టపోకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.