Aswapuram: దుమ్ముగూడెం ఆనకట్టను పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Aswapuram: ఎల్‌నినో ప్రభావంతో గోదావరిలో ప్రవాహాలు తగ్గుతున్న నేపథ్యంలో దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద నీటి నిల్వ పనులను వేగవంతం చేయాలని మంత్రి తుమ్మల ఆదేశించారు.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 15 Nov 2026 4:04 PM IST
Aswapuram
X

Aswapuram: దుమ్ముగూడెం ఆనకట్టను పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

అశ్వాపురం: ఎల్‌నినో ప్రభావంతో గోదావరి నదిలో నీటి ప్రవాహాలు తగ్గుతున్న నేపథ్యంలో రానున్న వేసవిలో తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ఇసుక బస్తాలతో చేపడుతున్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.

ఆదివారం అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి పరిధిలోని దుమ్ముగూడెం ఆనకట్టను భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి మంత్రి సందర్శించారు. ఆనకట్ట వద్ద ఇసుక బస్తాలతో నీటి నిల్వ మట్టాన్ని పెంచేందుకు చేపడుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఇప్పటివరకు పూర్తయిన మూడు లేయర్లు, మిగిలిన పనులు, నీటి లీకేజీ నివారణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురవడం వల్ల గోదావరి నదిలో నీటి ప్రవాహాలు గణనీయంగా తగ్గాయని తెలిపారు. సాధారణంగా జనవరి, ఫిబ్రవరి నెలల వరకు ఉండే నీటి ఇన్‌ఫ్లోలు కూడా తగ్గిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ పరిస్థితుల్లో గోదావరి జలాలపై ఆధారపడిన జిల్లాల్లో తాగునీటి అవసరాలను తీర్చడం అత్యంత కీలకమని అన్నారు .

ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద ఇసుక బస్తాలతో నీటిని నిల్వ చేసుకునే ఏర్పాట్లు చేపట్టామని, ఇప్పటికే మూడు లేయర్ల పనులు విజయవంతంగా పూర్తయ్యాయని, మరో రెండు లేయర్ల పనులను కూడా పూర్తి చేయాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. ఈ ఏర్పాట్ల ద్వారా సుమారు 1.2 మీటర్లకు పైగా నీటిమట్టాన్ని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని, తద్వారా రానున్న మూడు నుంచి నాలుగు నెలల పాటు తాగునీటి అవసరాలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చని అన్నారు.

అశ్వాపురం నుంచి మిషన్ భగీరథ పథకం ద్వారా మూడు జిల్లాలకు తాగునీటిని సరఫరా చేయాల్సి ఉందని, అందువల్ల దుమ్ముగూడెం వద్ద నీటిని నిల్వ చేసుకోవడం ఎంతో అవసరమని మంత్రి తెలిపారు. నీటి నిల్వకు ఏర్పాటు చేస్తున్న ఇసుక బస్తాల నుంచి నీరు లీకేజీ కాకుండా ప్రత్యేక రక్షణ షీట్లు ఏర్పాటు చేయాలని, నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచించారు.

సీతమ్మసాగర్ ప్రాజెక్టు పూర్తయితే దుమ్ముగూడెం వద్ద సుమారు 36 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుందని, దీనివల్ల 350 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా, మహబూబాబాద్ తదితర జిల్లాలకు గోదావరి జలాలను సరఫరా చేసేందుకు వీలవుతుందని వివరించారు. సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ అనుమతుల సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి, రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు.

సమ్మక్క సారక్క బ్యారేజీ వద్ద అదనంగా మూడు నుంచి నాలుగు టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నామని, ఇందుకు అవసరమైన అనుమతుల కోసం పొరుగు రాష్ట్రాలతో చర్చలు జరపాలని సూచించినట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద ప్రస్తుత పరిస్థితుల్లో గేట్ల నిర్వహణకు సంబంధించి అనుమతుల సమస్యలు ఉన్నందున అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఆనకట్ట వద్ద నీటి ప్రవాహం పెరిగి ఇసుక బస్తాలకు నష్టం కలగకుండా పవర్ హౌస్ ద్వారా నీటిని విడుదల చేసే అవకాశం ఉందని, అవసరాన్ని బట్టి కాటన్ నిర్మించిన గేట్లను కూడా వినియోగించుకోవచ్చని మంత్రి తెలిపారు. నీటి నిల్వకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు గేట్లు, పవర్ హౌస్‌ను మూసివేసి నీటిని నిల్వ చేసుకోవాలని, వరద ప్రవాహం పెరిగినప్పుడు ఇసుక బస్తాలకు నష్టం కలగకుండా తగిన జాగ్రత్తలతో నీటిని విడుదల చేయాలని అధికారులకు సూచించారు.

ఇరిగేషన్ శాఖ అధికారులు గత పది రోజులుగా శ్రమించి మూడు లేయర్ల పనులను విజయవంతంగా పూర్తి చేయడం అభినందనీయమని మంత్రి అన్నారు . మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి నీటి నిల్వకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని, సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఇరిగేషన్ అధికారులు నిరంతరం సమన్వయంతో పనిచేస్తూ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.

ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల్లో గోదావరి పరివాహక జిల్లాల ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని, ఈ విపత్కర పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న ప్రతి నీటి వనరును సమర్థవంతంగా వినియోగించుకొని ప్రజల తాగునీటి అవసరాలను కాపాడుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో అమ్మగారి పల్లి సర్పంచ్ కవిత ఇరిగేషన్ శాఖ ఎస్‌ఈ మహేశ్వరరావు , ఈఈ రాంబాబు , ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA