Mulakalapalli: అభాగ్యురాలికి ఎమ్మెల్యే జారే అండ: ఇందిరమ్మ ఇల్లు మంజూరు

Mulakalapalli: ములకలపల్లి మండలం జగన్నాథపురంలో నిరుపేద మూగ మహిళకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అండగా నిలిచి నిలిచిన పింఛన్‌ను పునరుద్ధరింపజేసి, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 6 Nov 2026 8:16 PM IST
Mulakalapalli
X

Mulakalapalli: అభాగ్యురాలికి ఎమ్మెల్యే జారే అండ: ఇందిరమ్మ ఇల్లు మంజూరు

ములకలపల్లి: సాధారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలు సమర్పించిన తర్వాత ప్రజాప్రతినిధులు స్పందిస్తుంటారు. అయితే అందుకు భిన్నంగా ఓ నిరుపేద మహిళ కష్టాలను తెలుసుకున్న అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నేరుగా ఆమె నివాసానికి వెళ్లి సమస్యలను స్వయంగా పరిశీలించారు. నిలిచిపోయిన ఆసరా పింఛన్‌ను పునరుద్ధరించాలని బ్యాంకు అధికారులతో మాట్లాడటంతో పాటు, నిలువ నీడ లేని ఆమెకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి భరోసా కల్పించారు.

*తీరని కష్టం.. నిలిచిన పింఛన్‌తో ఇబ్బందులు:* మండల పరిధిలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన వరలక్ష్మి భర్త లేకుండా ఒంటరిగా జీవిస్తున్న మూగ మహిళ. ప్రభుత్వం అందించే ఆసరా పింఛనే ఆమెకు ప్రధాన జీవనాధారం. స్థానిక తెలంగాణ గ్రామీణ బ్యాంకులో స్వయం సహాయక పొదుపు సంఘం ద్వారా తీసుకున్న రుణంలో తన వాటాకు సంబంధించిన మొత్తాన్ని పూర్తిగా చెల్లించినప్పటికీ, అదే గ్రూపులోని మిగిలిన నలుగురు సభ్యులు రుణ బకాయిలు చెల్లించలేదనే కారణంతో ఆమె వ్యక్తిగత పింఛన్ ఖాతా నిలిచిపోయినట్లు తెలిసింది. దీంతో పింఛన్ అందక ఆమె ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

*వర్షాలకు దెబ్బతిన్న పూరిగుడిసె:* మరోవైపు ఆమె నివాస పరిస్థితి కూడా దయనీయంగా మారింది. తలదాచుకుంటున్న పూరిగుడిసె ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా తడిసిపోయి, ఎప్పుడు కూలిపోతుందో తెలియని స్థితికి చేరింది. ఒకవైపు పింఛన్ అందక, మరోవైపు సరైన నివాసం లేక ఆమె పడుతున్న ఇబ్బందులు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ దృష్టికి వెళ్లాయి.

*క్షేత్రస్థాయికి వెళ్లి స్పందించిన ఎమ్మెల్యే:* విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా వరలక్ష్మి నివాసానికి చేరుకున్నారు. శిథిలావస్థకు చేరిన గుడిసెను, ఆమె ఎదుర్కొంటున్న పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. స్వయం సహాయక సంఘంలోని ఇతర సభ్యుల రుణ బకాయిల కారణంగా తన వాటా చెల్లించిన మహిళ పింఛన్ నిలిచిపోవడంపై బ్యాంకు అధికారులతో మాట్లాడారు. ఇతరుల బకాయిల కారణంగా ఈమెను ఇబ్బందులకు గురిచేయకుండా, పింఛన్ సమస్యను వెంటనే పరిష్కరించి తిరిగి అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిబంధనల పేరుతో నిస్సహాయురాలైన మహిళకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు.

*నిలువ నీడ కోసం ఎదురుచూస్తున్న మహిళకు ఇందిరమ్మ ఇల్లు:* నివసించేందుకు సరైన ఇల్లు కూడా లేని ఆమె పరిస్థితిని చూసిన ఎమ్మెల్యే, వరలక్ష్మికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్లు అక్కడికక్కడే ప్రకటించారు. అధికారుల నివేదికల కోసం ఎదురుచూడకుండా బాధితురాలి వద్దకే వెళ్లి ఆమె సమస్యలను తెలుసుకుని పింఛన్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవడంతో పాటు ఇంటి సౌకర్యం కల్పిస్తామని ప్రకటించడంపై గ్రామస్తులు, స్థానికులు ఎమ్మెల్యే స్పందనను అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో స్వాతి బిందు, ఎంపీడీవో రమేష్, మండల అధ్యక్షుడు జహీరుద్దీన్, పంచాయతీ కార్యదర్శి సునేష్, సర్పంచ్ వినోద్, మాజీ జడ్పీటీసీ బత్తుల అంజి తదితరులు పాల్గొన్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN