Kothagudem: కొత్తగూడెం కార్పొరేషన్ వివాదం డీపీఆర్ రద్దుపై కూనంనేని!
Kothagudem: కార్పొరేషన్ విమర్శలను కూనంనేని తిప్పికొట్టారు. పారదర్శకత కోసమే పాత డీపీఆర్ రద్దు చేసి, ఆన్‌లైన్ విధానం తెస్తున్నట్లు స్పష్టం చేశారు.
Kothagudem: కొత్తగూడెం కార్పొరేషన్ వివాదం డీపీఆర్ రద్దుపై కూనంనేని!
Kothagudem: కొత్తగా ఏర్పాటైన కొత్తగూడెం కార్పొరేషన్‌పై కొందరు చేస్తున్న విమర్శలపై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, కమిషనర్ సుజాత తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
“పసిగుడ్డును గొంతు నులిమి చంపడాన్ని రాక్షసత్వం అంటారు. కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్‌ను అభివృద్ధి చేసే ప్రయత్నాలను అడ్డుకునేలా విమర్శలు చేయడం కూడా రాక్షసత్వంతో సమానం” అని కూనంనేని వ్యాఖ్యానించారు.
ఇంటి నెంబర్లు, ఇంటి పట్టాల విషయంలో లంచాలు తీసుకునే వారే తమను విమర్శిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ అభివృద్ధికి అనుభవం ఉన్న వారి సలహాలు, సహకారం తీసుకుంటే కొందరు పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషాను ‘షాడో ఎమ్మెల్యే’గా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసే వారిని తాను ఎక్కడా చూడలేదని, వారు విషపూరితమైన విమర్శలకు పాల్పడుతున్నారని అన్నారు.అవినీతి అంటే బెదిరింపులకు పాల్పడటం, కబ్జాలు చేయడం, లంచాలు తీసుకోవడమేనని కూనంనేని పేర్కొన్నారు.
ఇలాంటి చర్యలకు పాల్పడితే ప్రజలకు తెలియదా అని ప్రశ్నించారు. కార్పొరేషన్‌లో ఎవరైనా ఇంటి నంబర్లు లేదా ఇంటి పట్టాల కోసం లంచాలు తీసుకున్నట్లు తేలితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
రూ.600 కోట్ల కేంద్ర సహాయం కోరాం
కొత్తగూడెం కార్పొరేషన్ అభివృద్ధికి నియోజకవర్గ ఎమ్మెల్యేగా కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.600 కోట్ల సహాయం కోరినట్లు కూనంనేని తెలిపారు. డీపీఆర్‌కు సంబంధించి 1.6 శాతం చొప్పున ప్రతిపాదనలు రూపొందించినట్లు వెల్లడించారు.
అయితే డీపీఆర్ నిబంధనలను పాటించలేదని, ప్రక్రియలో పారదర్శకత లేదని వస్తున్న విమర్శల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. “కమ్యూనిస్టు పార్టీ ఎమ్మెల్యేగా డీపీఆర్‌ను రద్దు చేస్తున్నాను” అని స్పష్టం చేశారు.
త్వరలోనే ఆన్‌లైన్ విధానంలో డీపీఆర్ ప్రక్రియను చేపడతామని కూనంనేని సాంబశివరావు తెలిపారు. కార్పొరేషన్ అభివృద్ధి విషయంలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.విలేకరుల సమావేశంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాష, కార్పొరేటర్లు, సిపిఐ పార్టీ నాయకులు పాల్గొన్నారు.




