Khammam: యాదవ సోదరులకు సదర్ పండుగ శుభాకాంక్షలు: ఎంపీ వద్దిరాజు

Khammam: తెలంగాణ యాదవ సమాజానికి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సదర్ పండుగ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 8 Nov 2026 7:26 PM IST
Khammam
X

Khammam: యాదవ సోదరులకు సదర్ పండుగ శుభాకాంక్షలు: ఎంపీ వద్దిరాజు

Khammam: సదర్ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తెలంగాణ యాదవ సమాజానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పశుసంపదను పూజించే పవిత్రమైన సదర్ పండుగను దీపావళి మరుసటి రోజు యాదవులు ఘనంగా జరుపుకుంటారన్నారు. ఈ పండుగను రాష్ట్రంలోని పలుచోట్ల, ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఘనంగా జరుపుకుంటారని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు.

శ్రీకృష్ణ భగవానుడు గోవర్థనగిరిని ఎత్తిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ పండుగను జరుపుకోవడం యాదవులకు ఆచారంగా వస్తున్నదన్నారు.యాదవుల సంస్కృతి,సంప్రదాయాలకు ఈ పర్వదినం ఒక ప్రతీక అని ఆయన అన్నారు.ఈ పండుగ నాడు దున్నపోతులను నీళ్లతో శుభ్రంగా కడిగి పూలదండలతో అందంగా అలంకరించి విన్యాసాలు చేయిస్తారన్నారు.

ఈ సందర్భంగా కళాకారుల డప్పు వాయిద్యాలు, తీన్మార్ నృత్యాలతో పాటు పహిల్వాన్ల కుస్తీ పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహిస్తారని ఎంపీ వద్దిరాజు వివరించారు.తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పదేళ్ల పాలనలో యాదవులకు సముచితమైన గౌరవం లభించిందని ఆయన చెప్పారు.తలసాని శ్రీనివాస్ యాదవ్ కు మంత్రి పదవినిచ్చి, బడుగుల లింగయ్య యాదవ్ ను పెద్దల సభ రాజ్యసభకు పంపి, జైపాల్ యాదవ్, అంజయ్య యాదవ్ లను ఎమ్మెల్యేలను చేసి,దూదిమెట్ల బాలరాజు యాదవ్,గెల్లు శ్రీనివాస్ యాదవ్ లను కార్పోరేషన్ ఛైర్మన్లను చేశారని ఎంపీ వద్దిరాజు గుర్తు చేశారు.

ఇందుకు భిన్నంగా కాంగ్రెస్ సర్కార్ యాదవులకు మంత్రి పదవి ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తంచేశారు.యాదవుల్లో మరింత ఐక్యతను,ఆత్మ గౌరవాన్ని పెంపొందించే ఈ పండుగను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకోవాల్సిందిగా ఆయన కోరారు.శ్రీకృష్ణుడి కృపా కటాక్షాలతో పాడి పంటలు, సిరిసంపదలతో రాష్ట్రం తులతూగాలని ఎంపీ వద్దిరాజు ఆకాంక్షిస్తూ యాదవ సమాజానికి హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.