Mulakalapalli: ఉధృత వాగులో నిండు గర్భిణిని కాపాడిన మహిళా సర్పంచ్‌

Mulakalapalli: ములకలపల్లి మండలం మూకమామిడిలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటించి నిండు గర్భిణిని కాపాడిన మహిళా సర్పంచ్‌ కోర్సా ఆదిలక్ష్మి. ధైర్యసాహసాలపై ప్రశంసల జల్లు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 5 Nov 2026 5:46 PM IST
Mulakalapalli
X

Mulakalapalli: ఉధృత వాగులో నిండు గర్భిణిని కాపాడిన మహిళా సర్పంచ్‌

ములకలపల్లి: ఒకవైపు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు.. మరోవైపు తెగిపోయిన వంతెన.. ఇంతలో నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. ఆసుపత్రికి వెళ్లే మార్గం లేక ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ఇలాంటి విపత్కర సమయంలో చొరవ చూపిన మూకమామిడి గ్రామ మహిళా సర్పంచ్‌ కోర్సా ఆదిలక్ష్మి, గ్రామ యువకులు, స్థానికుల సహాయంతో గర్భిణిని వాగు దాటించి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఆమె సమయస్ఫూర్తి, ధైర్యసాహసాలపై గ్రామస్థుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

మురసు తుపాను ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ములకలపల్లి మండలంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో మూకమామిడి, మొగరలగుప్ప గ్రామాల మధ్య ఉన్న కాజ్‌వే వంతెన వరద ఉద్ధృతికి దెబ్బతినడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గురువారం మొగరలగుప్ప గ్రామానికి చెందిన ఓ నిండు గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆసుపత్రికి తరలించడం కష్టంగా మారింది.

ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్‌ కోర్సా ఆదిలక్ష్మి వెంటనే అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని గమనించి గ్రామ యువకులు, స్థానికుల సహకారంతో బాధితురాలిని వాగు దాటించి అవతలి ఒడ్డుకు చేర్చారు. అనంతరం 108 అంబులెన్స్‌ ద్వారా సమీప ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు.

సర్పంచ్‌ తెగువపై ప్రశంసలు

తుపాను ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో సర్పంచ్‌ ఆదిలక్ష్మి స్థానికులకు అందుబాటులో ఉంటూ సహాయక చర్యల్లో చొరవ చూపడంపై గ్రామస్థులు అభినందిస్తున్నారు. ప్రమాదకర ప్రాంతాల వద్ద ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం అభినందనీయమని పేర్కొంటున్నారు. అత్యవసర సమయంలో స్పందించి గర్భిణిని సురక్షితంగా వాగు దాటించడంపై బాధితురాలి కుటుంబ సభ్యులు సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN