Mulakalapally: రెండు రోజుల్లో మూకమామిడి మొగరలగుప్ప మధ్య తాత్కాలిక రహదారి.. ఎమ్మెల్యే!
Mulakalapally: మూకమామిడి-మొగరలగుప్ప మధ్య వరదకు కొట్టుకుపోయిన వంతెన స్థానంలో 2 రోజుల్లో తాత్కాలిక రోడ్డు పూర్తి చేస్తామని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలిపారు.
Mulakalapally: రెండు రోజుల్లో మూకమామిడి మొగరలగుప్ప మధ్య తాత్కాలిక రహదారి.. ఎమ్మెల్యే!
ములకలపల్లి, నవంబర్ 6: భారీ వర్షాలకు మూకమామిడి–మొగరలగుప్ప గ్రామాల మధ్య వంతెన కొట్టుకుపోవడంతో నిలిచిపోయిన రాకపోకలను పునరుద్ధరించేందుకు రెండు రోజుల్లో తాత్కాలిక డైవర్షన్ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలిపారు. శుక్రవారం ఆయన సంబంధిత శాఖల అధికారులతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి దెబ్బతిన్న వంతెన, నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి, రైతులు, గ్రామస్తులు వంతెన కొట్టుకుపోవడంతో ఎదురవుతున్న రాకపోకల ఇబ్బందులను, వరదలకు దెబ్బతిన్న పంటల వల్ల జరిగిన నష్టాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే రెండు రోజుల్లో తాత్కాలిక రహదారి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. శాశ్వత వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు.
భారీ వర్షాలకు వరి సహా పలు పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారని, బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి సమగ్ర నివేదిక రూపొందించాలని సూచించారు.
మిరియాల మధుకు పరామర్శ
వరద ఉధృతిలో వాగు మధ్యలో చిక్కుకున్న మిరియాల మధును ఎమ్మెల్యే పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రమాదకర పరిస్థితుల్లో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి మధును సురక్షితంగా కాపాడిన రెస్క్యూ బృందం, అధికారులను అభినందించారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కురసం సీత, ఆత్మ కమిటీ చైర్మన్ సుంకురవల్లి వీరభద్రం, మాజీ జడ్పీటీసీ బత్తుల అంజి, ఎంపీడీవో సత్యనారాయణ, తహసీల్దార్ స్వాతి బిందు, ఎస్సై మధు ప్రసాద్, ఏవో అరుణ్ బాబు, పంచాయతీరాజ్ ఏఈ శ్రీనివాసరావు, ఎంపీవో రమేష్ బాబు, విద్యుత్ శాఖ ఏఈ నరేష్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వరప్రసాద్, పంచాయతీ కార్యదర్శి దోమల అరుణ్ కుమార్, ఏఈవో రాహుల్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.




