Mulakalapally: రోడ్ల మరమ్మతులకు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆదేశం!
Mulakalapally: మురసు తుఫాన్‌తో ములకలపల్లి మండలంలో దెబ్బతిన్న రహదారులు, వంతెనలను ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పరిశీలించారు. అనంతరం లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.
Mulakalapally: రోడ్ల మరమ్మతులకు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆదేశం!
ములకలపల్లి: ఇటీవల సంభవించిన మురసు తుఫాన్ ప్రభావంతో ములకలపల్లి మండలంలో దెబ్బతిన్న ప్రాంతాలను స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మండలంలోని పాతగంగారం, ముత్యాలంపాడు, జగన్నాధపురం, మూకమామిడి, చౌటిగూడెం, ములకలపల్లి, తాళ్లపాయి గ్రామాల్లో పర్యటించి దెబ్బతిన్న అంతర్గత రహదారులు, హైలెవల్ వంతెనలు, నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు, స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడుతూ తుఫాన్ వల్ల జరిగిన నష్టాలపై సమగ్ర నివేదికలు రూపొందించాలని సూచించారు. ప్రజల రాకపోకలకు, వ్యవసాయ పనులకు ఇబ్బందులు కలగకుండా దెబ్బతిన్న రహదారులు, వంతెనల వద్ద తక్షణమే తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. తుఫాన్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అర్హులైన వారికి అవసరమైన సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
అనంతరం మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో అర్హులైన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) చెక్కులను పంపిణీ చేశారు. పేదల సంక్షేమం, అర్హులైన వారికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




