Palwancha: నివాసాల మధ్య సెల్ టవర్ వద్దు.. గాంధీనగర్ లో నిరసన
Palwancha: పాల్వంచ గాంధీనగర్‌లో నివాసాల మధ్య నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన సెల్ టవర్ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని స్థానికులు ఆందోళన చేపట్టారు.
Palwancha: నివాసాల మధ్య సెల్ టవర్ వద్దు.. గాంధీనగర్ లో నిరసన
పాల్వంచ: పట్టణంలోని గాంధీనగర్ లో నివాస గృహాల మధ్య నిర్మిస్తున్న సెల్ ఫోన్ టవర్ కు వ్యతిరేకంగా స్థానికులు శుక్రవారం నిరసన తెలిపారు. నిర్మాణ స్థలం వద్దకు చేరుకున్న స్థానికులు నినాదాలు చేస్తూ తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా రహస్యంగా నిర్మాణ పనులు చేపడుతున్నారని ఆరోపించారు. టవర్ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
టవర్ల నుంచి నిరంతరం వెలువడే రేడియేషన్ ప్రభావం చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిపై తీవ్రంగా ఉంటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. దీర్ఘకాలంలో ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, అయితే అభివృద్ధి పేరుతో తమ ఉనికికే ముప్పు వాటిల్లే పరిస్థితిని మాత్రం సహించబోమని స్పష్టం చేశారు.
గాంధీనగర్ ప్రాంతం ఇప్పటికే అన్ని విధాలా కుంటుపడిందని, అనేక ఇళ్లు ఖాళీగా ఉన్నాయని వాసులు వాపోయారు. కిరాయిదారులు లేక, జనసంచారం తగ్గి ప్రాంతం వెలవెలబోతోందని అన్నారు. ఇలాంటి తరుణంలో ప్రమాదకరమైన టవర్ ఏర్పాటు చేస్తే ఉన్నవారు కూడా ఇళ్లు వదిలి వెళ్లిపోయే పరిస్థితి వస్తుందని, దీంతో గాంధీనగర్ పూర్తిగా నిర్వీర్యమైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి తామంతా ఏకమయ్యామని గాంధీనగర్ వాసులు తెలిపారు. వెంటనే జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. చట్టపరమైన, ప్రజాస్వామ్య మార్గంలో టవర్ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.




