Palvancha: చేయి కోల్పోయిన కార్మికురాలికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి
Palvancha: విధి నిర్వహణలో ప్రమాదానికి గురై చేయి కోల్పోయిన భద్రాచలం కార్మికురాలు సామ్రాజ్యం కుటుంబాన్ని ఆదుకోవాలని సీఐటీయూ ఆధ్వర్యంలో డీపీఓకు వినతిపత్రం ఇచ్చారు.
Palvancha: చేయి కోల్పోయిన కార్మికురాలికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి
పాల్వంచ: విధి నిర్వహణలో ప్రమాదానికి గురై ఎడమ చేయి కోల్పోయిన భద్రాచలం గ్రామ పంచాయతీ కార్మికురాలు సామ్రాజ్యం కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సీఐటీయూ ప్రతినిధి బృందం డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) అనూషకు వినతిపత్రం అందజేసింది.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎ.జె. రమేష్ మాట్లాడుతూ.. ఈ నెల 12వ తేదీన విధులు నిర్వహిస్తున్న సమయంలో వ్యాన్ ఢీకొట్టడంతో సామ్రాజ్యం కిందపడిందని, ఈ ప్రమాదంలో ఆమె ఎడమ చేయి తీవ్రంగా దెబ్బతిన్నదని తెలిపారు. పరిస్థితి విషమంగా ఉండటంతో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స చేసి ఎడమ చేతిని తొలగించాల్సి వచ్చిందని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పోస్టల్ ఇన్సూరెన్స్ చెల్లించినప్పటికీ, దానిని రెన్యువల్ చేయకపోవడంతో బాధితురాలికి బీమా పరిహారం అందే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విధుల్లో ఉండగా ప్రమాదానికి గురై చేయి కోల్పోయిన కార్మికురాలికి గ్రామ పంచాయతీ బాధ్యత తీసుకుని రూ.10 లక్షల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
అలాగే గ్రామ పంచాయతీ కార్మికులందరికీ తక్షణమే పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించాలని, గత మూడేళ్లుగా అందించని యూనిఫామ్‌తో పాటు చెప్పులు, కొబ్బరినూనె, సబ్బులు పంపిణీ చేయాలని కోరారు. ఆదాయం కలిగిన పంచాయతీ కావడంతో కార్మికుల వేతనాలు పెంచాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, ఆదివారాలు, పండుగ సెలవులు అమలు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
వినతిపై స్పందించిన డీపీఓ అనూష.. భద్రాచలంలో కార్మికురాలికి జరిగిన ప్రమాద ఘటన తన దృష్టికి రాలేదని, వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్మికుల వేతనాల పెంపునకు సంబంధించి ప్రతిపాదనలు వస్తే పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. డీపీఓను కలిసిన వారిలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎ.జె. రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు దొడ్డా రవికుమార్ ఉన్నారు.




