Palvancha: పాల్వంచ పెద్దమ్మతల్లిని దర్శించుకున్న దేవాదాయ శాఖ ఏసీ వీరస్వామి
Palvancha: పాల్వంచ పెద్దమ్మగుడిలో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ఎం. వీరస్వామి పూజలు. విజయదశమి రథోత్సవం, తెప్పోత్సవ ఏర్పాట్లపై భద్రాచలం ఈఓతో కలిసి సమీక్ష.
Palvancha: పాల్వంచ పెద్దమ్మతల్లిని దర్శించుకున్న దేవాదాయ శాఖ ఏసీ వీరస్వామి
పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంt కేశవాపురం–జగన్నాధపురం గ్రామంలో వెలసిన శ్రీ కనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మగుడి)ని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఖమ్మం జిల్లా సహాయ కమిషనర్ ఎం. వీరస్వామి తన సతీమణితో కలిసి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వారి వెంట భద్రాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి. రవీంద్రనాథ్ ఉన్నారు. పూజల అనంతరం ఆలయ అర్చకులు సహాయ కమిషనర్ దంపతులకు వేదాశీర్వచనం అందజేసి, అమ్మవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను అందించారు.
అనంతరం శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో చేపట్టిన ఏర్పాట్లను సహాయ కమిషనర్ పరిశీలించారు. మంగళవారం విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న రథోత్సవం, శమీపూజ, తెప్పోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర సౌకర్యాలు కల్పించాలని ఆలయ ఈఓకు సూచించారు. ఉత్సవాల సందర్భంగా పోలీసు శాఖ సమన్వయంతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకునేలా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.




