Palvancha: అంగరంగ వైభవంగా వనమా 82వ జన్మదిన వేడుకలు రాజకీయ ప్రముఖుల సందడి!

Palvancha: పాల్వంచలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు 82వ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గుర్రపు బగ్గీపై ఊరేగింపు నిర్వహించగా, పలువురు ప్రముఖ నేతలు హాజరయ్యారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 1 Nov 2026 9:02 PM IST
Palvancha
X

Palvancha: అంగరంగ వైభవంగా వనమా 82వ జన్మదిన వేడుకలు రాజకీయ ప్రముఖుల సందడి!

పాల్వంచ, నవంబర్ 01: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో మాజీ మంత్రి, 50 ఏళ్ల రాజకీయ దురంధరుడు వనమా వెంకటేశ్వరరావు 82వ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వనమా జన్మస్థలమైన పాత పాల్వంచ చింతల చెరువు కట్టపై శనివారం ఉదయం 8 గంటల నుండే వేలాది మంది అభిమానులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు తండోపతండాలుగా తరలిరావడంతో పండగ వాతావరణం నెలకొంది. "హ్యాపీ బర్త్ డే వనమా" నినాదాలతో హోరెత్తించారు.

ఉదయం 10 గంటలకు వనమా నివాసం నుంచి గుర్రపు బగ్గీపై వనమా దంపతులను భారీ ఊరేగింపుగా సభా ప్రాంగణానికి తీసుకువచ్చారు. ముందు భాగంలో 200 మంది కళాకారులు గిరిజన కోలాటం, లంబాడీ నృత్యాలు, డప్పు వాయిద్యాలతో సందడి చేశారు. వందల కేజీల పూలదండలతో, పూలవర్షం కురిపిస్తూ అభిమానులు ఘనంగా సత్కరించారు.

ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, బానోత్ హరిప్రియ, కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్, సీపీఐ రాష్ట్ర నాయకులు సాబీర్ పాషా హాజరయ్యారు. బీఆర్ఎస్ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ముఖ్య అతిథిగా హాజరైన పువ్వాడ అజయ్ వనమా పాదాలకు పాదాభివందనం చేశారు. అనంతరం నాయకులు పుష్పగుచ్ఛాలు అందించి, కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి మున్సిపల్ చైర్మన్, 20 ఏళ్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎదిగిన వనమా ప్రస్థానం అందరికీ ఆదర్శమని వక్తలు కొనియాడారు. 82 ఏళ్లు దాటినా ఆయనపై అభిమానం ఏమాత్రం తగ్గలేదని తరలివచ్చిన జన సందోహమే స్పష్టం చేస్తోందని అన్నారు. ఒక నాయకుడి జన్మదినానికి రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీల నాయకులు తరలిరావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN