Palvancha: రోజూ 20 ఇళ్లల్లో కుష్ఠు వ్యాధి సర్వే చేయాలి: డీఎంహెచ్‌వో!

Palvancha: పాల్వంచలో నిర్వహించిన సమావేశంలో ఎంపీహెచ్‌ఏలు రోజూ 20 ఇళ్లలో కుష్ఠు వ్యాధి సర్వే చేపట్టాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఎంహెచ్‌వో తుకారం రాథోడ్ ఆదేశించారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 24 Oct 2026 7:17 PM IST
Palvancha
X

Palvancha: రోజూ 20 ఇళ్లల్లో కుష్ఠు వ్యాధి సర్వే చేయాలి: డీఎంహెచ్‌వో!

పాల్వంచ: మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లు (ఎంపీహెచ్‌ఏలు) తమ పరిధిలోని గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తుకారం రాథోడ్ సూచించారు. ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య కనీసం 20 ఇళ్లను సందర్శించి కుష్ఠు వ్యాధి సర్వే నిర్వహించాలని ఆదేశించారు.

శనివారం పాల్వంచలోని డిప్యూటీ డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఎంపీహెచ్‌ఏలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో చేపట్టాల్సిన ఆరోగ్య కార్యక్రమాలు, వ్యాధుల నిర్ధారణ పరీక్షలు, టీకాల కార్యక్రమాల అమలుపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.

జ్వరం వచ్చిన ప్రతి ఒక్కరికీ ర్యాపిడ్ డయాగ్నస్టిక్ టెస్ట్ (ఆర్‌డీటీ) లేదా మైక్రోస్కోపీ ద్వారా మలేరియా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ప్రస్తుత నెలకు సంబంధించిన అన్ని రోగనిరోధక టీకాల కార్యక్రమాలను వందశాతం పూర్తి చేయాలని, మీజిల్స్‌–రుబెల్లా (ఎంఆర్‌) టీకాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. టీకాలు తీసుకోని పిల్లలను, మధ్యలో టీకాలు ఆపివేసిన వారిని గుర్తించి పూర్తిస్థాయిలో టీకాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

కుష్ఠు వ్యాధి సర్వేలు, క్షయవ్యాధి (టీబీ) గుర్తింపు కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని చెప్పారు. టీబీ అనుమానితులకు అవసరమైన నమూనాల సేకరణ, ఎక్స్‌రే, సీబీఎన్ఏఏటీ పరీక్షల నిర్వహణపై సిబ్బందికి వివరించారు. 2030 నాటికి టీబీ నిర్మూలన లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రజలకు వ్యాధిపై అవగాహన కల్పిస్తూ, అనుమానిత కేసులను గుర్తించి తగిన పరీక్షలు నిర్వహించేలా కృషి చేయాలని సూచించారు.

ఎంపీహెచ్‌ఏ (పురుషులు) ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య కనీసం 20 ఇళ్లను సందర్శించి కుష్ఠు వ్యాధి లక్షణాలపై సర్వే నిర్వహించాలని, నివేదికలను క్రమం తప్పకుండా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి సమర్పించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లే ముందు ఆరోగ్య కార్యక్రమాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ప్రజలకు సమర్థవంతంగా ఆరోగ్య విద్య అందించాలని తెలిపారు.

ప్రపంచ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలియో వ్యాధి నివారణ, పల్స్ పోలియో టీకాల ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని సూచించారు. సిబ్బంది అందరూ తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి, ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను సాధించాలని తుకారం రాథోడ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీటీసీవో డాక్టర్ ప్రసాద్, డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీధర్, పీవోడీటీ డాక్టర్ రాందాస్, ఏఎంవో రాందాస్ తదితరులు పాల్గొన్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN