Palvancha: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం
Palvancha: పాల్వంచ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకటేశ్వరరావు ప్రారంభించారు.
Palvancha: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం
పాల్వంచ: విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడంతో పాటు, రాబోయే పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో పాల్వంచ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపాల్ పి. శంకర్ ఆధ్వర్యంలో అధ్యాపకులు, సిబ్బంది, దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సి.హెచ్. వెంకటేశ్వరరావు, లక్ష్మీదేవిపల్లి గ్రామ సర్పంచ్ భూక్య మంజులతో కలిసి మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాబోయే మూడు నెలల పాటు ప్రతిరోజూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించనున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మాట్లాడుతూ.. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతిరోజూ కళాశాలకు హాజరవుతూ చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. రాబోయే పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థుల సంక్షేమం, విద్యాభివృద్ధి కోసం ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టిన ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బందిని అభినందించారు.
కళాశాల ప్రిన్సిపాల్ పి. శంకర్ మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమం కోసం ముందుకొచ్చిన అధ్యాపకులు, సిబ్బంది, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, దాతలు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.




