Palvancha: పెద్దమ్మగుడిలో మహిషాసురమర్దినీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
Palvancha: పాల్వంచ పెద్దమ్మగుడిలో శరన్నవరాత్రి ఉత్సవాల 9వ రోజు మహిషాసురమర్దినీ దేవిగా అమ్మవారి దర్శనం. చండీహోమం, నృత్య ప్రదర్శనల నిర్వహణ.
Palvancha: పెద్దమ్మగుడిలో మహిషాసురమర్దినీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేశవాపురం–జగన్నాధపురం గ్రామంలోని శ్రీ కనకదుర్గ దేవస్థానం (పెద్దమ్మగుడి)లో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 11న ప్రారంభమైన ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు అమ్మవారు శ్రీ మహిషాసురమర్దినీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఉదయం దేవస్థాన అర్చకులు, బుత్విక్కుల ఆధ్వర్యంలో ప్రాతఃకాలార్చన, శ్రీ లక్ష్మీ గణపతి అనుష్ఠానాలు, వేదపారాయణం, నవగ్రహ జపాలు, శ్రీ సూక్తం, మన్యుసూక్త పారాయణాలు, సప్తశతి పారాయణం, శ్రీచక్రార్చన, సూర్య నమస్కారాలు, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం నిర్వహించారు. ఉదయం దంపతుల పూజ, మధ్యాహ్నం 2 గంటల నుంచి చండీహోమం, లక్షకుంకుమార్చన కార్యక్రమాలు చేపట్టారు.
సాయంత్రం 6.30 గంటలకు సహస్రదీపాలంకరణ, రాత్రి 7 గంటలకు నీరాజన మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం నిర్వహించారు. అనంతరం హాస్యవల్లరి కార్యక్రమంతో పాటు కూచిపూడి నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు.
నేడు విజయదశమి వేడుకలు
మంగళవారం విజయదశమి (దసరా) సందర్భంగా ఉదయం 8.35 గంటలకు పూర్ణాహుతి నిర్వహించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు అమ్మవారి రథోత్సవం అనంతరం శమీపూజ, తెప్పోత్సవం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విజయదశమి ఉత్సవాల ముగింపు సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానంలో ఏర్పాట్లు చేశారు.




