Palwancha: 80 మంది సేంద్రియ రైతులకు ఉచిత గోవుల పంపిణీ
Palwancha: పాల్వంచలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ కేవీకే, అన్నపూర్ణ గోసంరక్షణ కేంద్రం ఆధ్వర్యంలో 80 మంది రైతులకు ఉచితంగా గోవులను పంపిణీ చేశారు.
Palwancha: 80 మంది సేంద్రియ రైతులకు ఉచిత గోవుల పంపిణీ
పాల్వంచ: పాల్వంచ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ అన్నపూర్ణ గోసంరక్షణ కేంద్రం, పాల్వంచ ముందడుగు వేసింది. కేవీకే భద్రాద్రి కొత్తగూడెం వారి సలహాలు, సూచనల మేరకు జిల్లాలోని 15 మండలాలకు చెందిన 80 మంది సేంద్రియ వ్యవసాయ రైతులకు ఒక్కొక్కరికి ఒక్క గోవు చొప్పున ఉచితంగా పంపిణీ చేశారు.
ఉత్తమ రైతు గాదె నర్సిరెడ్డి ఆధ్వర్యంలో, అన్నపూర్ణ గోసంరక్షణ కేంద్ర నిర్వాహకులు ఆంజనేయ శర్మ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సేంద్రియ వ్యవసాయంలో గోవుల పాత్ర ఎంతో కీలకమని, గోమూత్రం, పేడ ద్వారా సహజ ఎరువులు, జీవామృతం తయారు చేసుకుని భూమి సారాన్ని పెంపొందించుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి ఆధారిత వ్యవసాయం వైపు రైతులను నడిపించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు.
ఒక గోవు ద్వారా రైతుకు వ్యవసాయంలో ఎన్నో ప్రయోజనాలు కలగడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు. ఉచితంగా గోవులను అందుకున్న రైతులు హర్షం వ్యక్తం చేశారు.




