Palwancha: ఎర్త్ సైన్సెస్ వర్సిటీని ప్రపంచ స్థాయి సంస్థగా తీర్చిదిద్దుతాం
Palwancha: పాల్వంచలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ స్వర్ణోత్సవాలు; పూర్తిస్థాయి వీసీ, ఫ్యాకల్టీ, రూ.250 కోట్ల నిధులపై మంత్రి తుమ్మల వెల్లడి.
Palwancha: ఎర్త్ సైన్సెస్ వర్సిటీని ప్రపంచ స్థాయి సంస్థగా తీర్చిదిద్దుతాం
పాల్వంచ: డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన ప్రతిష్టాత్మక విద్యాసంస్థగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. యూనివర్సిటీ అభివృద్ధికి త్వరలో నిధులు సమకూర్చడంతో పాటు పూర్తిస్థాయి వైస్ ఛాన్సలర్, బోధనా సిబ్బంది నియామకాలు చేపడతామని వెల్లడించారు.
కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్‌గా 1976లో ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం నిర్వహించిన స్వర్ణోత్సవ వేడుకల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్‌తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఐదు దశాబ్దాలుగా ఈ విద్యాసంస్థ మైనింగ్ రంగానికి నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందిస్తోందన్నారు. ఇక్కడ చదువుకున్న వేలాది మంది సింగరేణి, కోల్ ఇండియా, కేంద్ర ప్రభుత్వ శాఖలతో పాటు దేశ విదేశాల్లో ఉన్నతస్థాయికి ఎదిగి సంస్థకు పేరు తీసుకొచ్చారని పేర్కొన్నారు. పూర్వ విద్యార్థుల అనుభవం, సూచనలు, సహకారం యూనివర్సిటీ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.
జిల్లాలో అపారమైన ఖనిజ సంపద, సహజ వనరుల నేపథ్యంలో వాటి అన్వేషణ, వెలికితీత, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, భూగర్భ, భూ విజ్ఞాన శాస్త్రాలపై పరిశోధనలకు ప్రోత్సాహం కల్పించాలనే లక్ష్యంతో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రతిపాదన తీసుకెళ్లగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని తెలిపారు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు ఈ యూనివర్సిటీకి పెట్టడం గర్వకారణమన్నారు.
యూనివర్సిటీకి పూర్తిస్థాయి వైస్ ఛాన్సలర్, బోధనా సిబ్బంది నియామకాలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. త్వరలోనే వైస్ ఛాన్సలర్ నియామకం చేపడతామని, కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్న పోస్టులను బదిలీ చేయడంతో పాటు అదనపు పోస్టులు మంజూరు చేసి పూర్తిస్థాయి విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. మాస్టర్ ప్లాన్‌ను ఆమోదింపజేసి భవనాలు, ఆధునిక ప్రయోగశాలలు, గ్రంథాలయం, విద్యార్థులు, అధ్యాపకుల నివాస సముదాయాలను దశలవారీగా ఏర్పాటు చేస్తామన్నారు. సింగరేణి, కోల్ ఇండియా తదితర సంస్థల సహకారంతో నిధులు సమీకరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
కోల్ ఇండియా, సింగరేణి, ఎన్ఎండీసీ, ఐఐటీలు, ఇతర విద్యా, పరిశోధనా సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. పూర్వ విద్యార్థులు ఆర్థిక సహకారంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం, నిపుణుల సేవలు అందించి యూనివర్సిటీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.
ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్ 50 సంవత్సరాల ప్రస్థానం గర్వకారణమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారం, మంత్రి తుమ్మల చొరవతో ఈ విద్యాసంస్థ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా రూపాంతరం చెందడం అభినందనీయమన్నారు. పూర్తిస్థాయి ఫ్యాకల్టీ నియామకాలు, అన్ని విభాగాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. యూనివర్సిటీ పరిధిలో 50 నుంచి 60 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నాయని వివరించారు. రాష్ట్ర బడ్జెట్లో రూ.250 కోట్ల నిధుల కేటాయింపు ప్రతిపాదన నేపథ్యంలో యూనివర్సిటీ అభివృద్ధి, ఆధునిక ప్రయోగశాలలు, గ్రంథాలయం, క్రీడా సదుపాయాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మైనింగ్ ఇంజనీరింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా స్టూడెంట్ చాప్టర్‌ను ప్రారంభించి విద్యార్థులకు ధ్రువపత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఆర్డీవో మధు, పాల్వంచ తహసీల్దార్ ధారా ప్రసాద్, జిల్లా పంచాయతీ అధికారి అనూష, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు బిక్కి రమేష్ కుమార్, సీనియర్ పూర్వ విద్యార్థులు, మైనింగ్ రంగ నిపుణులు, యూనివర్సిటీ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




